ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని, వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పురోగతి, టీబీ పరీక్షల పురోగతి, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇంజనీరింగ్, పంచాయితీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు.గతంలో కంటే ప్రసవాలు తక్కువ శాతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై కలెక్టర్ ఆరా తీశారు.

క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.రిస్క్ ఉన్న కేసులను జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులకు పంపాలని అన్నారు.జిల్లాలో ప్రగతిలో ఉన్న 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 57 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పురోగతిపై ఆరా తీసిన కలెక్టర్, నిర్మాణ పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు.33 ఆరోగ్య ఉప కేంద్రాలు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు.నిర్మాణ పనులు పూర్తయిన మేరకు ఫోటోలతో తదుపరి సమావేశానికి రావాలని ఆదేశించారు.

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులను పూర్తిగా అరికట్టేలా చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో క్రమం తప్పకుండా దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని మున్సిపల్, పంచాయితీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

కిరణం కార్యక్రమం కింద ఫిజికల్ హెల్త్ తో సమానంగా మెంటల్ హెల్త్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.టీబీ బాధితులను గుర్తించడం, చికిత్స అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.గౌతమి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్ర శేఖర్, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, టీఎస్ఎంఐడీసీ ఈఈ రమేష్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, ఆర్ఎంఓ డా.సంతోష్, మున్సిపల్ కమీషనర్లు మీర్జా ఫసత్ అలీ బేగ్, అన్వేష్, జిల్లా ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మహేష్ రావు, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News