మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్‌కు అన్యాయం జరుగుతుందా?       2018-06-01   22:53:33  IST  Raghu V

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి ఏం చేసినా పక్కా పకడ్బందీగా చేస్తాడు అనే విషయం తెల్సిందే. భారీ ఎత్తున మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు జక్కన్న తన మార్క్‌ను వినియోగిస్తున్నాడు. బాహుబలి చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను ఆయన రూపొందిస్తాడని చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అంతా కూడా అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ మల్టీస్టారర్‌లో హీరోల పాత్రలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. మొదట ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఇద్దరు కూడా ఈ చిత్రంలో ఫైటర్స్‌గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అన్నదమ్ముళ్లుగా వీరిద్దరు కనిపిస్తారని సమాచారం అందుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండగా, రామ్‌ చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా లీక్‌ చేయడం జరిగింది. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఇలాంటివి అప్పుడప్పుడు అంతా చేస్తూ ఉంటారు. అందరిలా జక్కన్న కూడా పాత్రను లీక్‌ చేశాడు.

ఎన్టీఆర్‌ పాత్ర గ్యాంగ్‌స్టర్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్‌ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోను నెగటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని, అలా చేయడం వల్ల ఆయన క్రేజ్‌ పడిపోతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ను కాప్‌గా చూపించి ఎన్టీఆర్‌ను నెగటివ్‌ రోల్‌లో చూపించడం వల్ల నందమూరి అభిమానుల మనోభావాలు దెబ్బ తింటాయని కొందరు రాజమౌళిని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో రాజమౌళి ఆ పాత్రను ఎలా డిజైన్‌ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు మెగా ఫ్యాన్స్‌ కూడా తనకు సన్నిహితుడు అయిన కారణంగా ఎన్టీఆర్‌కు మంచి పవర్‌ ఫుల్‌ పాత్రను ఇచ్చి, చరణ్‌కు మాత్రం పోలీస్‌ పాత్రను కట్టబెట్టాడు అని, చరణ్‌తోనే గ్యాంగ్‌స్టర్‌ పాత్ర వేయించాలి అంటూ మెగా ఫ్యాన్స్‌ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి సినిమా ఇంకా పట్టాలు ఎక్కక ముందే ఇలాంటివి వినాల్సి వస్తున్నందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త కంగారు పడుతున్నారు. మల్టీస్టారర్‌ చిత్రం అంటే ఇద్దరు హీరోలకు సమాన న్యాయం చేయడం అనేది అసాధ్యం. ఇందులో కూడా జక్కన్న ఏదైనా అద్బుతం చేస్తే తప్ప ఇద్దరికి న్యాయం జరగడం అనేది అసాధ్యం.