టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు అమరావతిలోనే మకాం వేశారు.అక్కడి నుంచే అమరావతి ఉద్యమాన్ని పరుగులు పెట్టించాలని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గదని, అమరావతి వ్యవహారంపై రాజీ లేకుండానే పోరాటం చేస్తామనే సంకేతాలను ఇచ్చేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు అమరావతి ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించడంతో పాటు, పార్టీ నాయకులంతా మరింత యాక్టివ్ గా ఉంటూ అమరావతి ఉద్యమంను ముందుకు తీసుకు వెళ్లేందుకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎక్కడ తాము వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అవుతామో అనే భయాందోళనలో చాలామంది నాయకులు వెనకడుగు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
టిడిపి లో చాలామంది నాయకులు బాబు పిలుపును లైట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, నిత్యం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడే చంద్రబాబు తనయుడు లోకేష్ అమరావతి ఉద్యమం యాక్టివ్ గా ఉండేందుకు ముందుకు రావడం లేదు.అసలు హైదరాబాద్ నుంచి ఆయన ఏపీకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి.70 ఏళ్ల వయసు దాటినా , కరోనా భయం వెంటాడుతున్నా, చంద్రబాబు పార్టీ కోసం రిస్క్ చేసి మరి ఏపీకి వచ్చారు.కానీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలు మోయాల్సిన లోకేష్ ఈ సమయంలో ఏపీలో ఉంటూ పార్టీలో తన సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉన్నా, ఆయన సైలెంట్ గా ఉండిపోతున్నారు.
కేవలం సోషల్ మీడియా ద్వారానే స్పందిస్తూ వస్తుండడం వంటి పరిణామాలన్నీ నాయకులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
చంద్రబాబు అమరావతి ఉద్యమం పెద్ద ఎత్తున చేయాలనీ, నాయకులంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇస్తున్నా, ఆయన తనయుడు లోకేష్ ఎందుకు స్పందించడం లేదని, అమరావతి పరిధిలోనే ఉన్న మంగళగిరిలో ఆయన పోటీ చేసి ఓటమి చెందారని, ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన సందర్భంలో లోకేష్ ఎందుకు యాక్టివ్ గా ఉండటం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి.