పార్టీ నిర్ణయాలకి, అలాగే అధిష్టానం నిబంధనలకి కట్టుబడి ఉండకుండా దిక్కార స్వరం వినిపించే నాయకులకి బేసిగ్గా పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు వస్తూ ఉంటాయి.అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలని ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు.
వాళ్ళకి వాళ్ళుగా స్వతంత్ర్యంగా ఉన్నారు.అలాగే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎప్పుడో అధికార పార్టీకి జై కొట్టిన అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
అయితే అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యింది.ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎంపీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు.పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని, పార్టీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యానించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
వారంలో రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని నోటీసులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఈ నోటీసుపై రఘురామకృష్ణంరాజు స్పందించారు.
తనకు నోటీసులు అందాయని ఆయన తెలిపారు.తాను ఏనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని చెప్పారు.
ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని, అయితే ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా చెప్పానని ఆయన అన్నారు.ఇందులో పార్టీ ధిక్కార స్వరం లేదని, కేవలం ఆవేదన మాత్రమే ఉందని కవర్ చేసుకుంటూ వచ్చారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి సమాధానం చెప్పడానికి వారం రోజులు అవసరం లేదని స్పష్టం చేశారు.