ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది.ఎప్పుడూ లేని విధంగా లోకేష్ యాక్టివ్ అవడమే కాకుండా, తాను జగన్ కు సరైన రాజకీయ ప్రత్యర్థి అనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడం లో సక్సెస్ అవుతున్నారు.
ఏపీలో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా అది వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేది అని తెలిసిన వెంటనే లోకేష్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగుతున్నారు.పరామర్శ పేరుతో బాధితులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అయితే లోకేష్ పర్యటనలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
వేల మంది పోలీసులను మోహరించి మరి లోకేష్ పర్యటన ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.దీంతో లోకేష్ మరింతగా దూకుడు పెంచారు.
ప్రభుత్వం తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా, టీడీపీ శ్రేణులు దానిని తిప్పికొట్టేందుకు ప్రయత్నించడం ఇలా అనేక సంఘటనలతో లోకేష్ గురించి చర్చ జనాల్లోనూ, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.గతంతో పోలిస్తే లోకేష్ పనితీరు బాగుందని, ఆయన పార్టీ కార్యక్రమాలను ప్రజా సమస్యల విషయంలో చురుగ్గా పాల్గొంటున్నారు అనే చర్చ మొదలైంది.
తెలుగుదేశం పార్టీలోనే లోకేష్ పై సదభిప్రాయం లేదు అని, ఆయన పార్టీలో కీలక పదవి అప్పగించినా, దానిని సమర్థవంతంగా నిర్వహించలేరని , తెలుగుదేశం పార్టీని ఆయన చేతుల్లో పెడితే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కి తీసుకు వస్తారనే భయమూ టిడిపి నేతలను వెంటాడేది.అయితే ఇప్పుడు ఆ అభిప్రాయం మారినట్టుగానే కనిపిస్తోంది.
అసలు లోకేష్ ప్రభావం ఇంతగా పెరగడానికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఏపీ సీఎం జగన్ అనే చెప్పుకోవాలి.

ఎందుకంటే లోకేష్ పర్యటన లను అడుగడుగున అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండటం వల్లే ,లోకేష్ కు ఈ స్థాయి పెరిగిందని, ఆయన పర్యటనలను విమర్శలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోతే లోకేష్ ను ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాదని, లోకేష్ భయంతోనే జగన్ ఇంతగా రియాక్ట్ అవుతున్నారు అనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్ళి పోతూ ఉండటం తో, లోకేష్ గ్రాఫ్ ఇంతగా పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.గత టీడీపీ ప్రభుత్వం లోనూ జగన్ ను చూసి చంద్రబాబు ఇదే విధంగా వ్యవహరించారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగున ప్రయత్నాలు చేస్తూ ఉండటం వంటి కారణాలతో, జగన్ ఇమేజ్ బాగా పెరిగిందని, టిడిపిని అధికారానికి దూరం చేసే స్థాయికి తీసుకు వచ్చిందని , ఇప్పుడు జగన్ అదే తప్పు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.