సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆశ వైసీపీ అధినేత జగన్ లో ఎక్కువగా కనిపించేది.జగన్ కు సీఎం కుర్చీ మీద ఆరాటం ఎక్కువ అంటూ అప్పట్లో ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పించేవారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం పట్టించుకోకుండా తాను చేయవలసినవన్నీ చేసాడు.పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పడ్డ కష్టమంతా ఫలించి కానీ వినీ ఎరుగని మెజార్టీ ఆ పార్టీ సొంతం అయ్యింది.
ఆ విధంగానే అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరూ ఊహించని స్థాయిలో మంత్రి మండలిని ఏర్పాటు చేసి కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తూ కీలకపదవులు కేటాయించాడు.జగన్ కూడా క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా తన పేరును ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అయితే తాను ఏరికోరి ఎంపిక చేసిన మంత్రుల్లో చాలామంది ఆశించిన స్థాయిలో పెరఫామెన్స్ చూపించలేకపోవడంతో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట.

ముఖ్యంగా జగన్ ఎక్కువగా ఫోకస్ చేసిన నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో మంత్రులు వెనుకబడుతున్నారని జగన్ భావిస్తున్నాడట.ఈ పథకాల అమలును జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎందుకంటే నవరత్నాలను ప్రజలకు సక్రమంగా అందిస్తామంటూ అధికారంలోకి వచ్చింది వైసీపీ.
ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.దీనికి సంబంధించి అనేక బిల్లులను రూపొందించి వాటికి చట్టబద్ధత కల్పించింది.
వీటి అమలు కోసం సీఎం జగన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అయితే, జగన్ స్పీడ్‌కు తగ్గట్టుగా మంత్రులు పనిచేయలేకపోతున్నారన్న భావన ప్రభుత్వ పెద్దల్లో కూడా వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విషయంలో మంత్రులు విఫలమవుతున్నట్టు జగన్ కూడా ఒక అంచనాకు వచ్చారు.

టీడీపీ ప్రభుత్వం కంటే తామే మెరుగైన పరిపాలన అందిస్తున్నామని చెప్పుకోవడంలో మంత్రులు విఫలం అవుతున్నారని, ప్రజా సంక్షేమం కోసం జగన్ ఎన్నో భారీ పథకాలకు రూపకల్పన చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మైలేజ్ పెంచలేకపోతున్నారని, జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రజలకు వివరించలేకపోతున్నారట.ఇటీవల మహిళా బిల్లు, 50శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన బిల్లు ఇలా ఒకటి కాదు, రెండు కాదు 19 బిల్లులను ఆమోదింప చేసుకుంది జగన్ ప్రభుత్వం.ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రుల అస్పష్టత పూర్తిగా కనిపిస్తోంది.
అలాగే, పథకాల సంగతి పక్కన పెడితే కనీసం ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో టీడీపీ మరింతగా విమర్శల దాడిని పెంచింది.ఇదంతా మంత్రుల వైపల్యంగానే జగన్ భావిస్తున్నాడట.
.