2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దగ్గర నుంచి జగన్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు అన్నిటిలోనూ తన మార్క్ స్పష్టంగా కనిపించేలా జగన్ చేసుకున్నారు.
అంతేకాదు ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేసిన పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ, వాటికి నిధుల కొరత ఏర్పడకుండా జగన్ జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అక్కడితో సరిపెట్టకుండా, తమ రాజకీయ ప్రత్యర్ధులకు మళ్లీ 2024 ఎన్నికల్లో అవకాశం దక్కకుండా ఏం చేయాలో అన్ని జగన్ చేసి చూపిస్తున్నారు.2024 నాటికి వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి డోఖా లేకుండా చూసుకుంటూనే, మళ్లీ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు అవసరమైన ఎత్తుగడలను జగన్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మొదట్లో ప్రతిపక్షాలు పెద్దఎత్తున వైసీపీ ప్రభుత్వం పైనా, జగన్ పైన విమర్శలు చేసేవారు.
జగన్ అవినీతి పరుడని, రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు అంటూ నానా హంగామా చేసేవారు.జగన్ మాత్రం ఎక్కడా ఎటువంటి విమర్శలకు స్పందించకుండా, తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
ప్రతిపక్షాలు అన్న తర్వాత విమర్శలు చేయడమే పని అని, జనాల్లో పట్టు పెంచుకుంటే అదే తమకు విజయాన్ని అందిస్తుంది అని జగన్ బలంగా నమ్ముతున్నారు.అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను రూపొందిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు చేశారు.ఇంకా మరి కొన్ని పథకాలను అమలుచేసి జనాల్లోకి మరింతగా దూసుకు వెళ్లాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.దీనిలో భాగంగానే బడుగు, బలహీన వర్గాలతో పాటు, రైతులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా కొత్త పథకాలకు రూపకల్పన చేశారు.వాటిని త్వరలోనే అమలు చేసి జనాల్లో మరింత బలం పెంచుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట.