వచ్చే నెలలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బిజెపీ గట్టి పట్టుదలగా ఉంది.అందుకే వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ పక్కా ప్రణాళిక బద్దంగా వ్యూహాలను అమలు చేస్తోంది.
బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికలో ముమ్మర కసరత్తుల తరువాత ఎంతో సమయం తీసుకొని నిన్న తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.మొదటి జాబితాలో 52 మందికి స్థానం కల్పించిన కాషాయ పార్టీ ఎవరు ఊహించని విధంగా ముగ్గురు ఎంపిలను ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది.
కరీంనగర్ నుంచి బండి సంజయ్( Bandi Sanjay Kumar ), కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, బోథ్ నుంచి సోయమ్ బాపూరావు లను రంగంలోకి దించింది అధిష్టానం.గత కొన్నాళ్లుగా బండి సంజయ్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.

ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సుముఖంగా లేరని, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల బరిలోని నిలుస్తారని ఇలా రకరలాల వార్తలు వినిపించాయి.తాను పోటీ చేయబోనని పలు మార్లు అధిష్టానం ముందు కూడా విన్నవించుకున్నారట.అయినప్పటికి బండి సంజయ్ ని అసెంబ్లీ ఎన్నికల బరిలోని నిలిపింది అధిష్టానం.2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బండి సంజయ్ ప్రత్యర్థి బిఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలు అయ్యారు.ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.కాగా ఈసారి కూడా బిఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకరే రేస్ లో ఉన్నారు.దాంతో బండి సంజయ్ కి మళ్ళీ ఓటమి తప్పదా అనే వాదన వినిపిస్తోంది.

ఇక దర్మపురి అరవింద్( Arvind Dharmapuri ) విషయానికొస్తే గత ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి పార్టీ నేత కల్వకుంట్ల కవితపై విజయం సాదించారు.ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో ఫలితం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.కోరుట్ల నియోజిక వర్గంలో బిఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల సంజయ్ బరిలో ఉన్నారు, మరి ఆయనను ఢీ కొట్టి దర్మపురి అరవింద్ గెలుపు జెండా ఎగురవేస్తారో లేదో చూడాలి.
ఇలా గజ్వేల్ నుంచి కేసిఆర్ కు పోటీగా ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.అలాగే సిరిసిల్ల నుంచి కేటిఆర్ కు పోటీగా రాణి రుద్రమ రెడ్డిని బరిలో దించింది కాషాయ పార్టీ.
మరి బిఆర్‌ఎస్ లోని బలమైన నేతలను ఢీ కొట్టి కాషాయ పార్టీ నేతలు ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.