తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీకి ( BRS )ప్రత్యామ్నాయం బిజేపీనే అని, ఈసారి ఎన్నికల్లో బిజేపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని గత ఆర్నెళ్ళ ముందు వరకు కమలనాథులు గట్టిగా చెబుతూవచ్చారు.రాష్ట్రంలో కూడా బిజేపీ ఎంతో కొంత ప్రభావం చూపుతూ వచ్చింది.
ఇప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసిఆర్ పాలన చూసిన ప్రజలు మార్పు కోరుకునే సమయంలో బిజేపీ కొంత బలపడుతూ రావడంతో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది కమలంపార్టీ.దీంతో బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బిజేపీనే అనే వాదన బలపడుతూ వచ్చింది.
ముఖ్యంగా బిజేపీకి అధ్యక్షత వహించిన బండి సంజయ్( Bandi Sanjay ) పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారనే చెప్పాలి.

కానీ అనూహ్యంగా కర్ణాటక ఎన్నికల్లో బిజేపీ( BJP ) ఓడిపోవడంతో తెలంగాణ బిజేపీ వ్యూహాలన్నీ తారుమారయ్యాయి.అదే టైమ్ బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కూడా బిజేపీని గట్టిగా దెబ్బ తీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.అధ్యక్షపదవి నుంచి బయటకు వచ్చిన తరువాత బండి సంజయ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
దాంతో పార్టీలో అగ్ర్రెసివ్ గా గళం విప్పే నేత ఎవరు లేకపోవడంతో కమలం పార్టీ మైలేజ్ తగ్గుతూ వచ్చింది.అదే టైమ్ లో బండి సంజయ్ ని కాదని ఈటెల కు అధిష్టానం ఎక్కువ ప్రదాన్యం ఇస్తూ రావడం కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణమైంది.

దానికి తోడు బండి సంజయ్( Bandi Sanjay ) మరియు ఈటెల ( Etela Rajender )మద్య కోల్డ్ వార్ కూడా పెరుగుతూ రావడం, పార్టీలో సీనియర్ నేతలందరు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల గూటికి చేరడం వంటి పరిణామాలతో కమలం పార్టీ పూర్తిగా డీలాపడింది.ఇక ఎన్నికల ముందు ఇతర పార్టీలతో పోల్చితే ప్రచారాలు కూడా నత్తనడకన సాగించారు కమలనాథులు.ముఖ్యంగా అగ్రేస్సివ్ ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బండి సంజయ్ ఎలక్షన్ ప్రచారాల్లో తన స్థాయి ప్రసంగాలు ఎక్కడ చేయకపోవడం బిజేపీని అంతర్గతంగా దెబ్బ తీసిన అంశం.మొత్తం మీద బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వల్లనే ఈ ఎన్నికల్లో కమలంపార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.