కమల్ హాసన్ హీరోగా కాజల్ హీరోయిన్‌గా శంకర్ దర్శకత్వంలో దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభం అయిన ఇండియన్ 2 చిత్రం అనేక కారణాల వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది.షూటింగ్ ప్రారంభం అవ్వడం ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవడం జరుగుతూనే ఉంది.
గత కొంత కాలంగా ఇదే తంతు.చివరగా షూటింగ్‌లో యాక్సిడెంట్ కారణంగా ఇద్దరు చనిపోయి పలువురు గాయపడటంతో షూటింగ్‌ను నిలిపేశారు.
ఈసారి మళ్లీ ప్రారంభించక పోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ 2 చిత్రం విషయంలో దర్శకుడు శంకర్ మరియు కమల్ హాసన్‌లు ఇంట్రెస్ట్ కోల్పోయారు అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరు కూడా మరో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే కమల్ ఒక సినిమాకు కూడా క్లాప్ కొట్టాడని వార్తలు వచ్చాయి.కాని ఇండియన్ 2 చిత్రం ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ వారు మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది.భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశాం.
ఈ పరిస్థితుల్లో సినిమాను ఎలా వదిలేస్తామని అనుకుంటున్నారు.మీడియాలో ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు అన్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసి షూటింగ్స్‌కు అనుమతించిన వెంటనే మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తామంటూ లైకా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.వచ్చే ఏడాదిలో భారతీయుడు వస్తుందని వారు నమ్మకంగా చెప్పారు.