అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే మంచి ఉద్యోగంలో చేరి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఎంతోమంది భారతీయ విద్యార్ధుల కల.ఇందుకోసం ఏళ్ల పాటు ప్రణాళికబద్ధంగా కృషి చేసి అనుకున్నది సాధించేవాళ్లు లక్షల్లో ఉన్నారు.
అందుకే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.కానీ కరోనా వైరస్ విజృంభణ, ట్రంప్ వీసా ఆంక్షలతో భారతీయుల మనసు మారిందని అప్పట్లో ఎంతోమంది విశ్లేషించారు.కానీ ఇదేది నిజం కాదని ఓ సర్వే తేల్చి చెప్పింది.
2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాను ఎంచుకున్నట్లు ‘ఓపెన్ డోర్స్ నివేదిక’ వెల్లడించింది.తాజాగా ఈ నివేదికను భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసింది.ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా 10 లక్షల మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్తుంటారు.
వీరిలో 20 శాతం మంది భారతీయ విద్యార్థులేనని ఓపెన్ డోర్స్ పేర్కొంది.గత కొంతకాలంగా ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు నివేదిక అభిప్రాయపడింది.

అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం వెలుతున్న భారతీయుల సంఖ్య గడిచిన పది సంవత్సరాల్లో రెట్టింపు అయ్యిందట.ఇందుకు కారణాలు లేకపోలేదు.అమెరికాలో లభించే ప్రాక్టికల్ అప్లికేషన్, అనుభవంతో కూడిన ఉన్నత ప్రమాణాలే విద్యార్థులను అంతర్జాతీయ మార్కెట్లో ముందువరుసలో నిలబెడుతున్నాయి అని అమెరికా రాయబారి డేవిడ్ కెన్నడీ వెల్లడించారు.భారత్‌లోని ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయిలో ఉన్న తమ సలహా కేంద్రాల ద్వారా అమెరికా విద్యపై భారతీయ విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు డేవిడ్ తెలిపారు.
అమెరికాలోని 4500 గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో విద్యావకాశాలపై కచ్చితమైన, సమగ్ర సమాచారాన్ని ఈ సలహా కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.వై-యాక్సిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో ఎడ్యుకేషన్ యూఎస్ఏ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
అమెరికాలో ఉన్నత చదువులపై మరింత సమాచారం కోసం ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ ఇండియా’ యాప్‌ను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.అమెరికాలో విదేశీ విద్యార్థుల చదువులకు సంబంధించి ‘ఓపెన్ డోర్స్’ పేరుతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ప్రతి ఏటా నివేదిక రూపొందిస్తోంది.

భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు గణితం, కంప్యూటర్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సులపై అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు.గత పదేళ్ల గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.2018-19లో అమెరికాలో భారతీయ విద్యార్థుల రికార్డుల ప్రకారం గణితం, కంప్యూటర్స్‌లో 37 శాతం మంది చేరారు.సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులను 34.2 శాతం మంది ఎంచుకున్నారు.బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో 10.3 శాతం మంది, ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ కోర్సులను 5.6 శాతం మంది చదివారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా భారతీయ విద్యార్ధుల్లో అమెరికా మోజు మాత్రం అలాగే వుంటుందని పలువురు అంటున్నారు.