జీవీకే గ్రూప్ నిర్వహణలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ అక్రమాల పై సీబీఐ తో పాటు ఇప్పుడు తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.ముంబై,హైదరాబాద్ తో పాటు మొత్తం 9 చోట్ల ఆ సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
జీవీకే సంజయ్ రెడ్డి,జీవీకే కార్పొరేట్ కార్యాలయాల తో పాటు జీవీకే పింకీ రెడ్డి ఆర్బిట్ ట్రావెల్స్ లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.సీబీఐ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.
ముంబై ఎయిర్ పోర్ట్ విమానాశ్రయం లిమిటెడ్ లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఈడీ కూడా దీనిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఏకకాలం లో దాదాపు 9 చోట్ల ఆ సంస్థకు చెందిన కార్యాలయాలపై సోదాలు నిర్వహించడం మొదలు పెట్టింది.ఫోర్జరీ,మోసం ద్వారా ఎమ్ ఐ ఎల్ కు చెందిన 730 కోట్ల నిధులను జీవీకే మళ్లించింది అంటూ సీబీఐ తన ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసింది.
సీబీఐ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి సేకరించిన వివరాలను తమకు అందించాలి అంటూ సీబీఐ ని కోరింది.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జూన్ 27 న 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
చీటింగ్,ఫ్రాడ్,క్రిమినల్ కుట్ర వంటి అభియోగాలు ఆ సంస్థ పై నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో జీవీకే గ్రూప్ ప్రమోటర్లు ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్, అలానే కొందరి అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
జీవి కృష్ణారెడ్డి,సంజయ్ రెడ్డిలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేయగా తాజాగా పింకీ రెడ్డి వ్యవహారం పై కూడా సీబీఐ దృష్టి పెట్టింది.