భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్ పే ప్రాసెసింగ్ ఫీజు కింద రెండు రూపాయల వరకు యూజర్ల నుంచి వసూలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇది కేవలం టెస్టింగ్ దశలో మాత్రమే ఉందని.
కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పుకొచ్చింది.దీంతో చాలామంది యూజర్లు ఎక్కడ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుందోనని తమ అన్ని పేమెంట్స్ తగ్గించేశారు.
ఈ నేపథ్యంలో ఫోన్ పే క్లారిటీ ఇచ్చింది.తమ యాప్‌లో అన్ని యూపీఐ నగదు బదిలీలు, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ చెల్లింపులు (యూపీఐ, వాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు) ఉచితం అని స్పష్టం చేసింది.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వినియోగదారులందరికీ ఈ సేవలు ఉచితంగా అందిస్తామని క్లారిటీ ఇచ్చింది.
యూజర్లు ఫోన్ పే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జ్ వసూలు చేయడం లేదని, భవిష్యత్తులోనూ చేయదని గుర్తించాలి.
కానీ ముందస్తుగా చెప్పినట్లు మొబైల్ రీఛార్జీలపై మాత్రం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు సైతం ఛార్జీలు పడతాయి.ఇక మిగతా అన్ని లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సి పనిలేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రయోగం కింద కొందరు యూజర్లు రూ.51-100 మధ్య రీఛార్జ్ లకు రూ.1.రూ.100కు పైగా రీఛార్జీలకు రూ.2 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తున్నారు.

ఈ ఛార్జ్ యూపీఐ, వాలెట్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల యూజర్లకు వర్తిస్తుంది.అయితే రూ.50 కన్నా తక్కువ విలువైన రీఛార్జ్ లకు ఎలాంటి ఫీజు వర్తించదు.మార్కెట్ వాటా తగ్గించుకునేందుకు ఫోన్ పే యాప్ ఇలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒకటే యాప్ మొత్తం మార్కెట్ వాటాను కొల్లగొట్టకూడదనేది భారత ప్రభుత్వం నియమం.ఇందుకు తగ్గట్లుగా తమ వ్యాపారాన్ని పరిమితం చేసేందుకు ఫోన్ పే చర్యలు చేపట్టినట్లు సమాచారం.మొబైల్ రీఛార్జ్ లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
కాబట్టి వీటిని అదుపులోకి తెస్తే వాటా తగ్గుతుందని ఫోన్ పే భావించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.