ప్రజావాణి వినతులకు ప్రాధాన్యత నిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ఫార్వార్డ్ చేశారు.ఈ సందర్భంగా వేంసూరు చౌడవరం గ్రామం నుండి అల్లు సరిత తమ భూమి హైవే లో గ్రీన్ ఫీల్డ్ క్రింద సేకరణ చేయగా, భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారని, భూమిలో ఉన్న బోరు, కేసింగ్, మోటార్లకు నష్టపరిహారం ఇవ్వలేదని ఇప్పించగలందులకు కోరగా, కల్లూరు ఆర్డీవోకు పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మధిర మండలం మడిపల్లి గ్రామస్తులు సాదా బైనామా ద్వారా ఉన్న భూమిని పట్టేదార్ పాస్ పుస్తకాల్లో నమోదుకు కోరగా, మధిర తహసీల్దార్ కు పరిశీలనకు కలెక్టర్ ఆదేశించారు.
స్థానిక సారధి నగర్ 48వ డివిజన్ నుండి కావేటి స్వప్న, తనకు డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరుకు కోరగా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం కొత్త బస్టాండ్ నుండి కె.సీత తాను ఒంటరి మహిళనని, ఆసరా పెన్షన్ మంజూరుకు కోరగా విచారించి, చర్యలు తీసుకుంటామన్నారు.ఎర్రుపాలెం మండలం మోలుగుమాడు గ్రామం నుండి వేపూరి గోపాల్ రావు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల నమోదుకు కోరగా, జిల్లా పౌరసరఫరాల అధికారిని చర్యలకై ఆదేశించారు.కామేపల్లి మండల కేంద్రం నుండి ఎస్కె.
దాదాసాహెబ్ తన కుమారుడు ఎస్కె.షరీఫ్ పుట్టుకతో అంధుడని, ఉపాధికల్పనకు కోరగా, జిల్లా సంక్షేమ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.
కొండ్రుపాడు గ్రామం సూరయ్య బంజార తాండ నుండి ధర్మసోతు భూలి రైతుభీమా మంజూరుకు కోరగా, జిల్లా వ్యవసాయ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.వినతులు పెండింగ్ లేకుండా చూడాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.