అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.సోమవారం కలెక్టర్ జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో అనధికార కట్టడాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం 59 ఉత్తర్వు జారీచేసిందన్నారు.ప్రభుత్వ ఉత్తర్వు 58 ద్వారా 125 చదరపు గజాల లోపు నిర్మాణాలు క్రమబద్దీకరణ చేసినట్లు, ఉత్తర్వు 59 ద్వారా 125 చదరపు గజాల పైన ఉన్న గృహాలు, వాణిజ్య సముదాయలు క్రమబద్దీకరణకు అవకాశం కల్పించినట్లు ఆయన అన్నారు.
ఖాళీ స్థలాలు కాకుండా కట్టడాలు ఉండాలని ఆయన తెలిపారు.అట్టి కట్టడాల నిర్మాణాలు 2 జూన్, 2014 లోగా జరిగినవి ఉండాలన్నారు.విద్యుత్ బిల్లులు, ట్యాక్సుల చెల్లింపు రశీదులు రికార్డుగా సేకరించాలన్నారు.విచారణ చేపట్టి, డాక్యుమెంట్, ఆధారాలు సేకరించాలన్నారు.
ప్రతిరోజు 25 కట్టడాల రికార్డు సేకరణ లక్ష్యంగా కార్యాచరణ చేయాలన్నారు.రోడ్లు, చెరువులు ఆక్రమించుకొని కట్టిన కట్టడాలు క్రమబద్ధీకరణ చేయరాదన్నారు.
అధికారులకు పూర్తి అవగాహనకై శిక్షణ ఇవ్వాలన్నారు.ప్రక్రియ పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నియించామన్నారు.
సెప్టెంబర్ 30 కల్లా రికార్డుల సేకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.