తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీ (TDP)గుర్తింపు పొందింది.ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ అభివృద్ధి, ప్రజాసేవను తన ప్రధాన విధేయతగా ముద్రించుకుంది.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.పలు సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తూ వస్తోంది.
అయితే, తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
తూర్పు గోదావరి జిల్లా దెందులూరు మండలం చల్ల చింతలపూడికి చెందిన దాసరి బాబూరావు అనే రైతు సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP central office) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తన భార్య నాగలక్ష్మితో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన మణికట్టు కోసుకునే ప్రయత్నం చేశారు.పార్టీ సిబ్బంది వేడుకుంటూ అడ్డగించిన తర్వాత ఆయనను వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
బాబూరావు తెలిపిన వివరాల ప్రకారం.ఆయనకు చెందిన పదెకరాల పొలం (సర్వే నంబర్లు 12/2, 13/4) చల్లచింతలపూడిలో ఉంది.మాజీ సర్పంచ్ సత్యనారాయణ (Former Sarpanch Satyanarayana)లీజుకు తీసుకున్న అనంతరం అనుమతులు లేకుండా మట్టిని తవ్వే కార్యక్రమం సాగుతోంది.దీనికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar), ఆయన అనుచరులు తోడుగా ఉన్నారని బాబూరావు ఆరోపించారు.
ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లో మట్టిని తవ్వేశారని తెలిపారు.ఈ వ్యవహారంపై బాబూరావు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.అంతేకాకుండా, గనుల శాఖ తనపై రూ.1.25 కోట్లు జరిమానా విధించిందని తెలిపారు.టీడీపీ గ్రీవెన్స్ సెల్‌కు(TDP Grievance Cell) కూడా అనేకసార్లు ఫిర్యాదు చేసినా సమస్యకు పరిష్కారం కనిపించలేదని వాపోయారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన పార్టీ కార్యాలయంలో ఇలాంటి ఆత్మహత్యాయత్నం జరగడం ఆందోళన కలిగించే అంశం.బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ వ్యవహారం పట్ల అధికార పార్టీ, పోలీసు వ్యవస్థ, టీడీపీ గ్రీవెన్స్ విభాగం లోపాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.రైతుల భూములు, జీవనాధారంపై ఇలాంటి అన్యాయాలు చోటుచేసుకోకుండా చూడటం ప్రభుత్వ, రాజకీయ నేతల బాధ్యత.