తెలంగాణలో సాగర్ ఉప ఎన్నికతో పాటు రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే కేసీఆర్ దృష్టి అంతా కోదండరాం పోటీ చేస్తోన్న వరంగల్-నల్గొండ-పట్టభద్రుల నియోజకవర్గంపైనే ఉంది.
ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ… సూర్యాపేట జిల్లాలో ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు అందరి ముందే నిరసన గళం వినిపించాడు.
ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యే వర్గం కోదండరాంకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటన చేసింది.పైగా ఆ మాజీ ఎమ్మెల్యేది సైతం కేసీఆర్ సొంత సామాజిక వర్గమే.
ఈ పరిణామాలు టీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు.
కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు 2018 ఎన్నికల్లో జిల్లాలో ఏకైక టీఆర్ఎస్ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయారు.
ఆయనపై గెలిచిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి రావడంతో వెంకటరావును అధిష్టానం పట్టించుకోవడం లేదు.ఇక ఆ నియోజకవర్గంలో ఆయన వర్గంగా ఉన్న వాళ్లంతా ఇప్పుడు కోదండరాంకు సపోర్ట్ చేస్తున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత తాము ప్రొఫేసర్ కోదండరాంకు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు.దీని వెనక జలగం ఉన్నారన్న సందేహాలు కూడా ఉన్నాయి.

ఆమె గత ఎన్నికల్లో లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.ఇక కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాదించారు.అనంతరం మేరెడ్డి వసంత తిరిగి టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న కారణంతో ఇప్పుడు ఆమె కోదండరాంకు మద్దతు పలికి టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు.ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో సతమతమవుతున్న టీఆర్‌ఎస్‌కు సొంత పార్టీ నేతల అసమ్మతి గళాలు పెద్ద తలనొప్పిగా మారాయి.