జగన్ చెప్పినా అనుమానమే ? ఉద్యోగ సంఘాల గుర్రు ?

ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య వివాదం మరింత ముదిరే లా కనిపిస్తుంది.

ఇప్పటికీ ఏపీ  ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో పాటు,  పథకాల నిర్వహణ భారంగా మారడం కొత్త అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం వెతుకులాట ప్రారంభించిన సమయంలోనే , ఉద్యోగ సంఘాలు పీఆర్సీని అమలు చేయాలంటూ ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంపై హెచ్చరికలు కూడా చేస్తున్నారు.తాజాగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగియడంతో ఉద్యోగులు సమ్మె బాట పడతారనే అనుమానాలు మొదలయ్యాయి.

పీఆర్సి నివేదికను వెంటనే బయటపెట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది.సాంకేతిక అంశాలను ఇంకా అధ్యయనం చేయాలని ,అప్పటి వరకు పీఆర్సీ నివేదిక బయటపెట్టేదే లేదని ప్రభుత్వం చెబుతోంది.

పదిరోజుల్లో పీఆర్సీ నివేదిక ప్రకటిస్తామని చెబుతున్నారు.అయితే దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు .అసలు పీఆర్సి రిపోర్ట్ ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని మండి పడుతున్నారు.

Advertisement

ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 10 రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు .తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు .

అయితే  పీఆర్సీ నివేదిక బయట పెట్టకుండా ఈ విధంగా హామీ ఇచ్చి సరిపెట్టాలి అనుకోవడం వెనుక ఏదో మతలబు ఉంది అనే అనుమానాలు బలపడుతున్నాయి.  జగన్ కనుక తన హామీని నెరవేర్చకపోతే ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పడితే జగన్ ప్రభుత్వానికి మరో తలనొప్పి మొదలైనట్లే .ఇప్పటికే అనేక వర్గాలు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సమయంలో కీలకమైన ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి దూరమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు