టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ పరిస్థితి చూసుకుంటే గతం కంటే బాగా మెరుగుపడినట్టుగానే కనిపిస్తోంది .మొదట్లో టిడిపికి ఆయన భారం అవుతారని, అనవసరంగా చంద్రబాబు లోకేష్ ను తమ మీద రుద్దుతున్నారనే అసంతృప్తి ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల్లో ఎక్కువగా కనిపించేది.
ఇక పార్టీ మారి బయటకు వెళ్లిన వారంతా లోకేష్ పైనే ప్రధానంగా విమర్శలు చేసేవారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
తానేంటో తన రాజకీయ సత్తా ఏంటో లోకేష్ చూపిస్తున్నారు.ప్రస్తుతం టిడిపి ప్రజా పోరాటాలు చేయడంలో యాక్టివ్ గా ఉంది.
లోకేష్ ముందుండి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.చంద్రబాబు స్థాయిలో చురుగ్గా పార్టీ నేతలతో మమేకం అవుతూ జగన్ ఢీకొట్టగలిగే సత్తా ఉన్న నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు.అక్కడ అమరావతి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తప్పకుండా తాను గెలుస్తానని లోకేష్ ధీమాతో ఎన్నికల్లో పోటీ చేశారు.
అయితే 5000 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి చెందారు.అయినా నిరాశ పడకుండా అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తానంటూ లోకేష్ ప్రకటించారు.
దీనికి తగ్గట్లుగానే ఆ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.వాస్తవంగా చెప్పుకుంటే టీడీపీకి అక్కడ మొదటి నుంచి అంత సానుకూలత లేదు.
అయినా లోకేష్ మాత్రం మంగళగిరిని విడిచి పెట్టేది లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు.అయితే మంగళగిరి లో కాకుండా ఏపీలో కొన్ని టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి లోకేష్ పోటీ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు జరిగినా.
తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.దీనికి తగ్గట్లుగానే ఆ నియోజకవర్గంలో తరచుగా పర్యటనలు చేస్తున్నారు.
స్థానిక సమస్యల పైన పోరాటం చేస్తున్నారు .ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్న క్యాంటీన్ , ఉచిత వైద్య పరీక్షల శిబిరాలు వంటివి చేపడుతున్నారు.తాను ఓటమి చెందినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాననే విధంగా లోకేష్ ప్రయత్నిస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని, అలాగే అమరావతి సెంటిమెంట్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువైందని, తప్పకుండా విజయం తనకే దక్కుతుందనే నమ్మకంతో లోకేష్ ఉన్నారు.అందుకే మంగళగిరి నుంచి మళ్లీ సిద్ధమంటూ ఆయన తమ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు.