మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.రాబోయే రోజుల్లో తాను కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందని ముందుగా చెప్పింది తానేనన్నారు.
అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ తాజా వ్యాఖ్యలపైన రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది.
బీజేపీలో చేరుతానని రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇదే మొదటి సారి కాదంటున్నారు.
అలాగే ఇదే చివరి సారి కూడా అవుతుందని అనుకోకూడదంటున్నారు.తాను బీజేపీలో చేరబోతున్నట్లు గత ఏడాదిన్నర కాలంగా ఆయన చెబుతునే ఉన్నారు.
బీజేపీలో చేరుతానని చెబుతున్నారేగానీ అసలు ఎప్పుడు, ఏరోజు చేరుతారనే విషయాన్ని ఏడాదిన్నరగా ఇలానే ఆయన నాన్చుతూ వస్తున్నారనే చర్చ తన నియోజకవర్గ ప్రజల్లో జరుగుతోంది.

గతంలోనూ రాజగోపాల్‌రెడ్డి పలుసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలూ ఉన్నాయి.అప్పుడు కూడా త్వరలో బీజేపీలో తాను చేరబోతున్నాననే వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి చేయడం గమనార్హం.అంతేకాదు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా బీజేపీని,మోడీ ప్రభుత్వాన్ని పొగడడం, కాంగ్రెస్ నేతలను విమర్శించడం రాజగోపాల్‌రెడ్డికి ఇదేమీ కొత్తకాదు.
నూతన సంవత్సరం సందర్భంగా మళ్లీ ఇప్పుడు శ్రీవారిని దర్శించుకున్నాక మరొకసారి ఆయన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలతోపాటు తన అన్న విషయంలో కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.తిరుమలలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలపడుతోందని మొదటగా చెప్పిన వ్యక్తిని తానేనన్నారు.
త్వరలో బీజేపీలో చేరుతానని మరొకసారి స్పష్టం చేశారు.తాను మాత్రమే బీజేపీలో చేరుతానని, తన అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు.
పీసీసీ చీఫ్ పదవి కోసం వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్య పోటీ నడుస్తోందన్నారు.ఎవరికి ఆ పదవి వరిస్తుందో కాలమే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేసీఆర్ పరిపాలన సాగించాలని ఆయన కోరారు.