తెలంగాణ లో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు , రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు.ఇప్పటికే హాథ్ సే హాథ్ భారత్ జోడో పాదయాత్ర పేరుతో తెలంగాణ లో రేవంత్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ లకు ధీటు గా కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా దృష్టి సారించింది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే విధంగా, జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ను నిర్వహించేందుకు తెలంగాణా కాంగ్రెస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.ఈ నెల 8 వ తేదీన ఆ సభను నిర్వహించాలని చూస్తోంది.

ఈ సభను భారీ ఎత్తున నిర్వహించడంతోపాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట.ఈ సభలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు గురించి, తెలంగాణ ప్రజలకు వివరించాలని , రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే రకమైన పతకాలను అమలు చేస్తామని చెప్పబోతున్నారట. ఈ సభలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు తోను మాట్లాడించబోతున్నారట.

ఇక కాంగ్రెస్ ఈ కీలక సభను కరీంనగర్ లో నిర్వహించడానికి కారణం ఇక్కడ బీఆర్ఎస్ కు గట్టి పట్టు ఉండడంతో పాటు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడి నుంచే బీఆర్ఎస్ తో పాటు ఇటు బిజెపికి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది అని, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ శ్రేణులు కొత్త ఉత్సాహం తీసుకొచ్చినట్లు అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయాలని భావిస్తుంది.ఇదే విధంగా తెలంగాణలోని పార్టీ కీలక నాయకులు అందరితోనూ పాదయాత్రలు చేయించి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.