ఈ మధ్యకాలంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి ( YCP ) అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.తమ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా, రంగంలోకి వైసీపీ నేతలు కొంతమంది దిగుతున్నారు.
వారిపై ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు.ఆ విమర్శలు చేసిన వారు ఎంతటి వారైనా తమకు అనవసరం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇదే విధంగా ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఆ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు( Chandrababu Naidu ) వల్లే అభివృద్ధి సాధ్యమైందని , మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఏపీ మరింతగా అభివృద్ధి చెందుతుంది అంటూ వ్యాఖ్యానించడం వైసిపి నేతలకు ఆగ్రహం తెప్పించింది.
వెంటనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి వారు రంగంలోకి దిగి, రజనీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.అయితే ఈ విమర్శలను తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది.
ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం, నగరి నియోజకవర్గాల్లో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ నియోజకవర్గంలో తమిళ ప్రాంతానికి చెందిన వారు ఎంతోమంది ఏపీలో సెటిల్ అయ్యారు.ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే ఏ ఎన్నికలలోనైనా ఏపీలో సెటిల్ అయిన తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఇక వీరికి రజనీకాంత్ పై అభిమానం ఎక్కువ.ఇప్పుడు వైసీపీ చేసిన విమర్శలు వారికి ఆగ్రహం కలిగిస్తే ,
వైసిపి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇదే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు రజనీకి జగన్ క్షమాపణలు చెప్పాలంటూ పదేపదే డిమాండ్ చేస్తూ, మరింత వేడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలోనూ రజనీ ఫ్యాన్స్ వైసీపీ పై ఫైర్ అవుతున్నారు.ఇవన్నీ తమకు కలిసి వస్తాయని, ఈ రెండు నియోజకవర్గాల్లో తప్పకుండా ఆ ప్రభావం కనిపిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారట.