ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ప్రభావం చాలా వరకు తగ్గిందని, టిడిపి ఇమేజ్ తో పాటు , తమ వ్యక్తిగత ఇమేజ్ బాగా పెరిగిందనే లెక్కల్లో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు మొదట్లో టిడిపిని భయపెట్టినా, ఆ తరువాత క్రమంగా ఆ పథకాలలోని చిన్న చిన్న లోపాలను సైతం ఎత్తి చూపించడం, పథకాలు అమలు తప్ప పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోకపోవడం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
ప్రజల్లోనూ మొదట్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించకపోవడం , తమకు కలిసి వస్తుందనేది చంద్రబాబు అభిప్రాయం .ప్రస్తుతం తమ కుటుంబంపై వైసీపీ శ్రేణులు చేసిన విమర్శలు తమకు మంచి సానుభూతిని తీసుకువచ్చాయని, ప్రజల్లోనూ సానుభూతి బాగా పెరిగిందని బాబు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు తన వయసు కూడా లెక్కచేయకుండా , క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ వైసిపి ప్రభుత్వం పరిపాలన చేయడం లో విఫలమైందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న కాస్త వ్యతిరేకతను మరింత తీవ్రం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
దీనికి తోడు జగన్ ఎన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న, క్షేత్రస్థాయిలో పర్యటన చేయలేకపోవడం, ఆపద సమయంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం వదిలి బయటకు రాకపోవడం వంటివి తమకు కలిసి వస్తున్నాయని బాబు అభిప్రాయ పడుతున్నారు.జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా, భవిష్యత్తులో మరిన్ని కొత్త పథకాలు తీసుకువచ్చినా అభివృద్ధి చేయడం జగన్ విఫలమయ్యారనే అభిప్రాయం ఉంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో తమకు ఈ పరిణామాలన్నీ కలిసి వస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

జగన్ ఇక అభివృద్ధి అని కానీ, సంక్షేమ పథకాలను గాని ఎన్ని ప్రయత్నాలు చేసిన, తన గ్రాఫ్ పెంచుకోవడం అసాధ్యం అని, ఇక జగన్ పని అయిపోయింది అనేది బాబు లెక్కగా అర్ధం అవుతోంది.అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత ఎంత పెరిగినా, అది పూర్తిగా టీడీపీ కే కలిసి వస్తుంది అని బాబు అనుకోవడం అత్యాశే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.