ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ తమ శక్తికి మించి వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ వస్తోంది.మొదట్లో టిడిపి ఉనికి పై అందరిలోనూ భయాందోళనలు ఉండేవి.
చంద్రబాబు ఉ వయసు పైబడటం రాజకీయంగా ఆయన యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించకపోవడం వంటి ఎన్నో కారణాలతో పార్టీ శ్రేణులను వాటి నుంచి బయటపడేసేందుకు తెలివిగా చంద్రబాబు పెద్ద ఎత్తున పార్టీ పదవులను ప్రకటించారు.నియోజకవర్గంలో ఒక మోస్తరు కీలక నాయకుడు అనుకున్న వారు అందరికీ పదవులు దక్కేలా ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులకు వివిధ కమిటీల్లో పదవులు దక్కేలా చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు లేనంత స్థాయిలో పదవుల చేపట్టారు.ఈ పదవులతో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం వస్తుందని, పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటుందని, ఇలా ఎన్నో లెక్కలు వేసుకున్నారు.
కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి పదవులు పొందిన నాయకుల్లోనూ నిరాశ నిస్పృహలు ఇంకా అలుముకుంటూనే ఉన్నాయి.

వైసీపీ పై పోరాటం చేసేందుకు ఇంకా నాయకులు పెద్దగా ముందుకు రాని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది.ఒక వైపు చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నడుస్తోంది.పెద్దఎత్తున ఏకగ్రీవాలు చేసి విజయాన్ని తమ పార్టీ ఖాతాలో వేసుకుని టీడీపీ కి గట్టి షాక్ ఇవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
కొన్ని కొన్ని పరిస్థితులు టిడిపి కి అనుకూలంగా ఉన్నా, నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడం, వచ్చినా తూతూ మంత్రంగా అన్నట్లుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో తెలుగుదేశం పార్టీ ప్రతి దశలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొద్దిరోజుల క్రితమే పార్టీ పరిస్థితులపై నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సర్వే చేయించారట.
ఆ సర్వేలో కొత్తగా పదవులు పొందిన నాయకుల్లో పెద్దగా ఉత్సాహం లేదని, ఎక్కడ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉందని తేలిందట.దాదాపు సగం పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని బాబు సర్వేలో తేలిందట.175 నియోజకవర్గాలకు గాను దాదాపు 50 నియోజకవర్గాల్లో నియోజకవర్గాల ఇంచార్జిల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట.31 నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జీలు ఉన్నా, వారు పార్టీని పట్టించుకోవడంలేదట.
ఇక 16 నియోజకవర్గాల్లో అసలు ఇంచార్జీలే లేకపోవడం, అక్కడ బలమైన నేతలు లేకపోవడం, ఉన్నా పదవులు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొనడం ఇలా ఎన్నో కారణాలతో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కుంటోంది.పార్టీ నేతలను ఎంతగా యాక్టివ్ చేద్దామని చూస్తున్నా, చాలా చోట్ల ఉలుకూ పలుకూ లేదు అన్నట్టుగా నాయకుల పరిస్థితి ఉండడంతో బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.