ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గేటుపై ఖలిస్తాన్ బ్యానర్లు, జెండాలు కనిపించడంతో ఆదివారం దేశవ్యాప్తంగా కలకలం రేగింది.దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సీరియస్‌గా పరిగణించారు.
దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.
అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ, సిక్కు న్యాయవాది, సిక్కు ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆయనను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
అంతేకాకుండా చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 13 కింద పన్నూపై అభియోగాలు నమోదు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌కు పొరుగున వున్న రాష్ట్రాల్లో ఖలిస్తాన్ అనుకూలవాదులు రెచ్చిపోతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వుండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 11న ఉనా జిల్లాలోనూ ఖలిస్తాన్ బ్యానర్‌ను కట్టిన ఘటన కలకలం రేపింది.ఇక గత వారం హర్యానాలోని కర్నాల్ వద్ద ఆయుధాలతో తెలంగాణకు వస్తున్న కారును పోలీసులు అడ్డుకుని నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు అన్ని అంతర్రాష్ట్ర సరిహద్దుల చెక్‌పోస్టులు, హోటళ్లు, సత్రాలు వంటి వాటిపై గట్టి నిఘా వుంచాలని డీజీపీ ఆదేశించారు.ప్రత్యేక భద్రతా విభాగాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, క్విక్ రియాక్షన్ టీమ్‌లను యాక్టీవ్‌గా వుంచాలని సూచించారు.
రాష్ట్రంలోని కీలక డ్యామ్‌లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, పట్టణాలు, ఇతర అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇకపోతే.
కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల కోరిన సంగతి తెలిసిందే.పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదంతో పాటు హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ప్రమేయం వున్నందుకు గాను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రకారం ఎస్ఎఫ్‌జేను జూలై 2019లో భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.

వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సందర్భంగా ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు జరిగిన మార్చ్ సందర్భంగా ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేసిన వారికి ఎస్ఎఫ్‌జే 2.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.85 కోట్లు) బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ఎస్ఎఫ్‌జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ, కేటీఎఫ్ నేత పరమ్‌జిత్ సింగ్ పమ్మా, హర్దీప్ సింగ్ నిర్జర్లను భారత ప్రభుత్వం తీవ్రవాదులుగా ప్రకటించింది.ఎస్ఎఫ్‌జే, బీకేఐ, కేటీఎఫ్, కేజడ్ఎఫ్ వంటి ఖలిస్తానీ సంస్థలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
ఈ కుట్రల కోసం యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఖలిస్తానీ గ్రూప్‌లకు భారీగా నిధులు అందుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.