దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని కీలకం చేసేందుకు , దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి, కమిటీలను నియమించి బలమైన పార్టీగా మార్చేందుకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా ఈ క్రిస్మస్ తరువాత ఢిల్లీ లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాలతో పాటు, పార్టీ క్యాడర్ ను నియమించే పనికి శ్రీకారం చుట్టారు.పెద్ద ఎత్తున రైతు సంఘాల ప్రతినిధులతోనూ బిఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఢిల్లీలో క్రిస్మస్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి పార్టీ విధానాలను ప్రకటించాలని, క్రిస్మస్ తర్వాత శరవేగంగా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్ట బోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పార్టీకి మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ మేరకు పార్టీకి అనుబంధంగా కిసాన్ సెల్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.రైతు అజెండాతో ముందుకు వెళ్లడం ద్వారా , బీఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి న నినాదాలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ పాటలను సిద్ధం చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమం సమయంలో, ఉద్యమ నేపథ్యం ఉన్న పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం రావడంతో ఇప్పుడు అదే ఫార్ములాను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని కేసిఆర్ భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా, 2024 ఎన్నికల్లో అంత ప్రభావం చూపించలేమని, అందుకే ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యంతో కేసిఆర్ ఉన్నారు .నెలలో పది రోజుల పాటు ఢిల్లీ లోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.” అబ్ కి బార్ కిసాన్ సర్కార్ ” ‘దేశ్ కి నేత కిసాన్ కి భరోసా ‘ ‘ దేశ్ కి నేత కేసీఆర్ వంటి నినాదాలను జనాల్లోకి తీసుకువెళ్లి బీఆర్ఎస్ ను విస్తరించే ప్లాన్ తో కేసీఆర్ ఉన్నారు.







