అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో రెండు పార్టీల మధ్య రగులుతున్న చిచ్చు పరస్పర దాడి చేసుకునే వరకు వెళ్లింది.ఇదివరకే టీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రామ మందిరం వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే నిన్న కూడా టీఆర్ఎస్‌కు చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఇదే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఓరుగల్లులో రాజకీయ దుమారం చెలరేగుతుంది.మొదట బీజేపీ కార్యకర్తలు శ్రీరాముడి నిధి సమర్పణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపారు.
అది ఉద్రిక్తతకు దారి తీయగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి, పలువురిని అరెస్ట్ చేశారు.

అనంతరం టీఆర్‌స్ కార్యకర్తలు, చల్లా ధర్మారెడ్డి అనుచరులు కర్రలు, రాళ్లతో బీజేపీ కార్యాలయంపై దాడికి దిగి కార్యాలయాన్ని ధ్వంసం చేశారట.దీంతో మరికొందరు బీజేపీ కార్యకర్తలు, నాయకులతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మా, బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ఇక ఈ విషయంలో వరంగల్ వెళ్లుతున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఘట్కేసర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ లో బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించడానికి బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఏసీపీ భుజంగరావు ఘట్కేసర్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.