అన్యాయంగా ... అన్యాయం చేశారు ! ఈ పాపం ఆ పార్టీలదేనా ..?       2018-06-13   04:22:48  IST  Bhanu C

విభజన కష్టాలతో సతమతం అవుతున్న ఏపీ విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో స్టాండ్ తీసుకుంటున్నాయి. ఏపీకి మావల్లే న్యాయం జరుగుతోంది అంటే కాదు కాదు మావల్లే అంటూ పార్టీలన్నీ క్రెడిట్ తమ ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే.. రాష్ట్రాన్ని మోసం చేసింది మీరంటే మీరే అంటూ ఒకదానిపై మరొక పార్టీ దుమ్మెత్తిపోసుకోవటం చూసిన తర్వాత అందరిలోనూ గందరగోళం మొదలైంది. మొత్తానికి పార్టీ ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరిగింది వాస్తవమే అన్న విషయం స్పష్టమైంది.

-

కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ ని విభజించింది. ఆ తరువాత విభజన హామీలను అమలు చేస్తామని ఇదే నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు పదే పదే బహిరంగ వేదికలపై ప్రజలకు హామీలిచ్చిన సంగతి అందరూ అప్పట్లో చూసిందే. అప్పట్లో వాళ్ళిచ్చిన హామీలను నిజమని నమ్మి జనాలు వాళ్ళకు ఓట్లు వేశారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నాలుగేళ్లపాటు దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకున్నారు.. కేంద్రంలో టీడీపీకి..ఏపీలో బీజేపీకి మంత్రి పదవులు పంచుకున్నారు. కానీ ఎప్పుడెప్పుడూ కూడా .. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, లోటు భర్తీ లాంటి విషయాలపై నోరు మెదపకపోయినా టీడీపీ కిక్కురుమనలేదు. అంతే కాదు… హోదా కోసం, రైల్వేజోన్ కోసం ఉద్యమాలు చేసిన వైసిపి తదితర పార్టీలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.

ఏపీని అభివృద్ధి చేయడంలో కూడా బాబు దాదాపుగా ఫెయిల్ అయినట్టే కనిపించింది. సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందటం లేదన్న ఆరోపణలు పెరిగిపోయాయి. జన్మభూమి కమిటీల ఆధిపత్యం పెరిగిపోవటంతో గ్రామ స్ధాయిలో గొడవలు ఎక్కువైపోయాయి. దాంతో రాజకీయాలతో సంబంధం లేని సామాన్య జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది.

ఏపిని మోసం చేయటంలో బిజెపికి ఎంత పాత్ర ఉందొ.. చంద్రబాబుకూ అంతే పాత్ర ఉంది. ఎందుకంటే, నాలుగేళ్ళపాటు కేంద్రం చేసిన మోసాన్ని చంద్రబాబు ఎప్పుడూ నిలదీయలేదు. పైగా కేంద్రం ఏపికి చాలా సాయం చేసిందని, దేశంలో ఏ రాష్ట్రానికి రానంత సాయం ఏపికి వచ్చిందని ఎన్నోసార్లు బాబు చెప్పడం ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. వాస్తవంగా చూసుకుంటే ఏపీకి టీడీపీ .. బీజేపీ రెండు పార్టీలు అన్యాయం చేసాయనడం లో సందేహమే లేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.