గత కొద్ది రోజులుగా ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం రోజురోజుకు మరింత ముదురుతోనే ఉంది.
ఇప్పటికే టిడిపి జాతియ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్టు చేయడం, కోర్టుకు తరలించడం, ఆయనకు కోర్టు రిమాండ్ విధించడం వంటివి జరిగాయి.టిడిపి కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వల్లపునేని వంశీ అనుచరులు ధ్వంసం చేసినట్లుగా టిడిపి ఆరోపణలు చేస్తూ, ఈ స్థాయిలో రచ్చ చేసింది.
ఈ వ్యవహారంలో అనేక మందికి గాయాలు కాగా, ఎంతో ఆస్తి నష్టం జరిగింది.ఇక అక్కడ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇప్పటికే టిడిపి వర్సెస్ వల్లభనేని వంశీ అన్నట్లుగా మీడియా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.ఈ వ్యవహారం ఇలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు గన్నవరం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన, పార్టీ నేతల పైన దాడి జరిగిన నేపథ్యంలో వారందరినీ పరామర్శించి పార్టీ ఆఫీసును పరిశీలించేందుకు రేపు చంద్రబాబు గన్నవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.రేపు ఉదయం ఉండవల్లి నుంచి బయలుదేరి గన్నవరం వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే చంద్రబాబు గన్నవరం వెళ్తే అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో, పోలీసులు చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇస్తారా లేక నిరాకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.అసలు చంద్రబాబు రెండు రోజుల క్రితమే గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించారు.కానీ ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం వైపు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించడంతో వెనక్కి తగ్గారు.అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం వెళ్లి తీరాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో, ఆయన పర్యటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.







