నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి కొండేటి మల్లయ్య, నల్లగొండ డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు.బుధవారం కేతేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ గుండాల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ఫైరయ్యారు.
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిలదీస్తున్న రేవంత్ రెడ్డిపై దాడికి పాల్పడటం హేయమైన చర్యని అన్నారు.హాథ్ సే హాథ్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి వెంట సింగరేణి ప్రజలు,యువకులు ముందుండి నడిపిస్తున్నారని,రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఆదరణ లభిస్తోందని,దీన్ని చూసి ఓర్వలేకనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దాడి చేయించారని ఆరోపించారు.
ఇది మంచి పద్ధతి కాదని,తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్ రెడ్డి,జడ్పిటిసి మాజీ సభ్యుడు జటంగి వెంకటనర్సయ్య,నకిరేకల్ మండల మాజీ అధ్యక్షులు కోట పుల్లయ్య,కోట శ్రీను, రాచకొండ లింగయ్య,రాష్ట్ర నాయకుడు కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.