దేశంలో నల్ల కుబేరుల భరతం పట్టేందుకు గాను ప్రధాని మోడీ మోగించిన పెద్దనోట్ల రద్దు భేరీ ఇప్పుడు జనసామాన్యం నెత్తిన పిడుగులా పరిణమించింది.కేవలం రెండు నుంచి నాలుగు రోజుల్లోనే ఈపెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఏర్పడిన పరిస్థితి కొలిక్కి వస్తుందని మోడీ ప్రకటించినా.
ఇప్పుడు దాదాపు 10 రోజులు దాటిపోయినా ఎక్కడా అలాంటి సర్దుకున్న వాతావరణం కనిపించకపోగా పరిస్థితి తీవ్రమైంది.ప్రజల్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ప్రధాని మోడీ చర్యపై ఇప్పుడు అసహనం కట్టలు తెగుతోంది.
జనాలకు అవసరమైన చిల్లర నోట్లను అదించడంలో ఆర్‌బీఐ పూర్తిగా విఫలమైంది.మరోపక్క నోట్ల మార్పిడిపై పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టడంతో మార్పిడి కోసం వచ్చే వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
వందశాతం వైట్ మనీ అయినా…దాన్ని డ్రా చేసుకునే పరిస్థితి లేదు.బ్యాంకులకు వచ్చే కస్టమర్లలో ముందు వచ్చిన మూడు వందలు లేక నాలుగు వందల మందికి టోకెన్లు ఇచ్చిన తరువాత క్యాష్ ఇవ్వబోయే సమయానికి రెండు వేలు తీసుకోండి…మూడువేలు తీసుకోండని.
బ్యాంక్ సిబ్బంది కస్టమర్లను బతిమలాడుకుంటున్నారు.ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తోంది.
థర్డ్ పార్టీ చెక్కులు, డీడీలు కూడా క్లియర్ కాని పరిస్థితి నెలకొంది.ఎటిఎంల పరిస్థితి మరింత దిగజారిపోతోంది.
ఇప్పటికే ఎటిఎంలలో నగదు లేదు.ఎక్కడన్నా ఉన్నా…వాటి కోసం చాంతాడులా ‘జనం’ క్యూ కడుతున్నారు.
పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.చాలా మందికి నగదు చేతిలో ఉంచుకోవడమే తెలుసు.
డెబిట్‌కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆర్‌జిఎస్,డిడి,చెక్‌లు గురించి వారికి పెద్దగా అవగాహన లేదు.దీంతో వారంతా బ్యాంకుల మీదే ఆధారపడుతున్నారు.
చిల్లర లేక అనేక వ్యాపారాలు మూతబడ్డాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరో 50 రోజుల వరకు కొత్త నోట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ మరో విషాకర పరిణామం ఏమంటే.ఎప్పుడూ లేని ఒత్తడి ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులపై పడిందట! పని గంటలు పెరిగిపోయి, శారీరకంగా అలసిపోతుండడంతో వారిలో అసహనం వ్యక్తం అవుతోంది.
పని ఎక్కువ అయి ఒత్తిడి పెరిగిపోయి నలుగురు బ్యాంక్ సిబ్బంది ఇప్పటికే మరణించారు.దీంతో బ్యాంక్ ఉద్యోగ సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇలా మొత్తంగా ప్రధాని మోడీ కొండ నాలుకకు మందేస్తే.ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉందట పరిస్థితి.
మరి ఎన్నాళ్లకు ఈ పరిస్థితిలో మార్పు వస్తుందో చూడాలి.ఇప్పటికైతే బ్యాంకుల వద్ద క్యూ తప్పదు!!
.