నిజమే! తాజాగా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే.ఏపీ సీఎం చంద్రబాబు ఎంత డేంజర్‌లో ఉన్నారో అర్థమవుతుంది! గతంలో తొమ్మిదేళ్లు ఉమ్మడి ఏపీని పాలించిన సమయంలోనూ ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం అయ్యాక కూడా ఆయనను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారనేది తెలిసిందే.
గతంలో తిరుమల కొండకు వెళ్లే మార్గం అలిపిరిలో మావోయిస్టులు జరిపిన దాడి నుంచి బాబు తృటిలో బయటపడ్డారు.ఇక, ఆ తర్వాత ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈ ఏడాది జరగిన బలిమెల అటవీ ప్రాంతంలో ఏపీ పోలీసులు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 35 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో మావోయిస్టు నేత ఆర్కే కుమారుడు మున్నా కూడా ఉండడం సంచలనం సృష్టించింది.
ఈ ఘటన అనంతరం, మావోయిస్టులు వెల్లడించారని చెబుతున్న ఓ వార్తలో చంద్రబాబు కుటుంబాన్ని అంతం చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు.
ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.ఈ హిట్ లిస్ట్‌లో తాజాగా బాబు కోడుకు లోకేష్‌ను కూడా చేర్చారు.
ఈ నేపథ్యంలోనే బాబుకు పెద్ద ఎత్తున భద్రత కల్పించారు.అయినా కూడా మావోయిస్టులు ఏదో ఒక రూపంలో ఆయనపై దాడికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
దీనికి తాజాగా వారు మీడియా మాధ్యమాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.మీడియా ప్రతినిధుల రూపంలో బాబు చెంతకు చేరి ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ విషయాన్ని సాక్షాత్తూ ఢిల్లీ పోలీసులే వెల్లడించడం ఇప్పడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.మావోయిస్టులు ఇప్పటికి ఆరు సార్లు బాబుపై రెక్కీకూడా నిర్వహించారని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా వారు ఏపీ పోలీసులను హెచ్చరించారు.చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఢిల్లీ పోలీసులు పదే పదే హెచ్చరించారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భద్రతా లోపాలు ఉన్నట్లు కూడా వారు హెచ్చరిస్తున్నారు.మావోయిస్టుల రెక్కీ క్రమంలో ఇకపై చంద్రబాబును కలవడానికి వచ్చే మీడియా మిత్రులు, పార్టీ నేతలను ఏపీ భవన్‌లోనికి రానివ్వకూడదని అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబుపై మావోయిస్టులు ఇప్పటికి ఆరు సార్లు రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు చెబుతుండగా.అసలలాంటి సమాచారం ఏదీ తమకు అందలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు, బాబు విషయంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పడంపైనా ఆయన తనకు తెలీదనే చెప్పుకొచ్చారు.అయితే, బాబుకు బ్రహ్మాండమైన భద్రత కల్పించామన్నారు.
ఎప్పటికప్పుడు సీఎం భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.