‘ఈరోజుల్లో’, ‘బస్టాప్’, ‘కొత్త జంట’ చిత్రాల తర్వాత దర్శకుడు మారుతి తన తర్వాత సినిమాను వెంకటేష్ హీరోగా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా దానయ్య నిర్మాణంలో ‘రాధా’ అనే సినిమా ప్రారంభం కూడా అయ్యింది.
ఆ సినిమాకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేసి సందడి చేశారు.సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందన్న సమయంలో కథ వివాదాస్పదం అవ్వడంతో సినిమాను ఆపేశారు.
గత సంవత్సరం అటకెక్కిన ఈ సినిమాను మళ్లీ దించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హోం మంత్రి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ కథను తాను వెంకటేష్‌తో ఒకసారి చెప్పాను అని, దాన్ని చిన్న చిన్న మార్పులతో ‘రాధా’ చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక రచయిత తెలుగు సినిమా దర్శకుల మరియు రచయితల సంఘంలో ఫిర్యాదు చేశాడు.దాంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.
ఆ రచయితతో ఒప్పందం జరిగిందో లేక, కొత్త కథను మారుతి రెడీ చేశాడో తెలియదు కాని, అతి త్వరలో వెంకటేష్‌తో సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సన్నిహితుల వద్ద మారుతి చెప్పుకొస్తున్నాడట.మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భలే భలే మొగాడివోయ్’ చిత్రం వచ్చే నెల 4న విడుదల కానుంది.
ఆ తర్వాత వెంకటేష్‌తో సినిమాపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.







