అమెరికాలోని భారతీయులకు( US Indians ) ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం( Indian Embassy ) అడ్వైజరీ జారీ చేసింది.ఇండియన్ ఎంబసీ పేరుతో నకిలీ కాల్స్( Fake Calls ) వస్తున్నాయని.
భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డ్ , ఇతర వివరాలను పంచుకోవద్దని పేర్కొంది.
పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ అంశాలకు సంబంధించిన వివరాలను చెబుతూ కేటుగాళ్లు తప్పుదోవ పట్టిస్తారని వారిని నమ్మి మోసపోవద్దని ఇండియన్ ఎంబసీ సూచించింది.
ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే తక్షణం తమకు సమాచారం అందించాలని హెచ్చరించింది.
ఇప్పటికే పలువురికి ఇలాంటి కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.భారత దౌత్య సిబ్బంది ఎవరు కూడా ప్రజల వ్యక్తిగత సమాచారం కోసం ఎలాంటి ఫోన్లు చేయరని .అధికారికంగా మెయిల్ ద్వారానే సంప్రదిస్తారని అధికారులు చెప్పారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు దీనిని అడ్డుపెట్టుకుని విదేశీ వలసదారులను భయపెడుతున్నారు.పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ పత్రాలలో తప్పులు ఉన్నాయని.వీటిని తాము సరిచేస్తామని, ఇందుకు డబ్బులు చెల్లించాలని వణికిస్తున్నారు.
ఈ లోపాలను కనుక సరిచేయకుంటే దేశం నుంచి బహిష్కరిస్తామని బెదిరించేసరికి కొందరు అమాయకులు అది నిజమేనని అనుకుని వారు చెప్పినట్లు చేసి మోసపోతున్నారు.వీటిపై ఫిర్యాదులు రావడంతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.

మరోవైపు ట్రంప్ దూకుడు నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ముఖ్యంగా డిపెండెంట్ వీసాలపై వెళ్లిన వేల మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు లక్ష మందికి పైగా భారతీయులకు బహిష్కరణ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.అమెరికాకు హెచ్ 4 వీసా కింద వెళ్లిన వారు 21 ఏళ్లు నిండితే వారు డిపెండెంట్ వీసా అర్హత కోల్పోతారు.
ఈ నేపథ్యంలో ఎప్పుడెం జరుగుతుందో తెలియక వీరంతా ఆందోళనకు గురవుతున్నారు.







