పలు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించి భరోసా అందించారు.
జిల్లాలోని తంగళ్ళపల్లి మండలకేంద్రానికి చెందిన కంసాని మహేశ్ కుమార్తె సమంత కొద్దిరోజులుగా బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.దవాఖానలో చికిత్స అందించేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.
అలాగే ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి కి చెందిన గోపగాని వీరస్వామి గౌడ్ భార్య లివర్ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు.తమ వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని ఆయా కుటుంబ సభ్యులు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు వారు బుధవారం విన్నవించారు.
వారి సమస్యలపై వెంటనే చలించి తక్షణ ఆర్థిక సహాయం కింద కంసాని మహేశ్ కుమార్తె సమంతకు రూ.లక్ష, గోపగాని వీరస్వామి గౌడ్ కు రూ.50 వేల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు.తమకు సహాయం అందించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు కృతజ్ఞతలు తెలిపారు.