రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ అయ్యే విధంగా చూడాలని, మారుమూల ప్రాంత గ్రామాలకు కూడా బ్యాంకు సేవలు అందాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన డి.
సి.సి, /డి.ఎల్.ఆర్.సి జూన్ త్రైమాసిక సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, మన జిల్లాలో ఉన్న జనాభాకు అనుగుణంగా బ్యాంకుల సంఖ్య ఉందా పరిశీలించాలని , ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేసే దిశగా మన జిల్లాలో ఉన్న రుద్రంగి, మల్యాల, నిజామాబాద్ గ్రామంలో నూతన బ్యాంక్ లు అవకాశం మేరకు ఏర్పాటు చేయాలని, రానున్న 3 మాసాలలో జిల్లాలోని యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగాలలో అభివృద్ధి చెందేలా, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సుమారు 1000 మందికి రుణాలు అందజేయాలని బ్యాంకర్లను కోరారు.
ప్రతి గ్రామం 500 నివాసాలు గల జనావాసం, 5 కిలోమీటర్ల రేడియస్ లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.రుద్రంగి, మల్యాల, నిజామాబాద్ గ్రామాలలో మంచి జనాభా ఉందని, ఇక్కడ బ్యాంకింగ్ సేవలు ప్రారంభిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రజలకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణాలు తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రజల అనవసరంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, లోన్ యాప్ ల నుంచి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుందని ప్రభుత్వ విప్ అభిప్రాయపడ్డారు.బ్యాంకర్లు నిర్వహించే అవగాహన కార్యక్రమాలపై ఒకరోజు ముందుగానే అక్కడ సమాచారం అందజేయాలని, బ్యాంకర్లు మానవత దృక్పథంతో సైతం పని చేయాలని సూచించారు.
సామాన్యులకు బ్యాంకు లావాదేవీల పట్ల మరింత అవగాహన కల్పించాలని కోరారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాల మంజూరు సకాలంలో చేయాలని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మెప్మా తరపున వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి రుణాలు త్వరగా అందేలా చూడాలని అన్నారు.
వేములవాడ దేవాలయం దగ్గర చిన్న చిన్న దుకాణాలు, వ్యాపారాలు నడిపే వ్యక్తులు బయట 3 శాతం, 5 శాతం వడ్డీలకు వ్యాపార నిమిత్తం అప్పులు తీసుకుంటున్నారని, వీరిని గుర్తించి పీఏం స్వానిధి క్రింద రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు ప్రభుత్వ విప్ సూచించారు.
రుద్రంగిలో కెనరా బ్యాంక్ , మల్యాల లో యు బి ఐ, నిజామాబాద్ గ్రామాలలో ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ లు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వ విప్ ప్రతిపాదించగా, దానికి బ్యాంకర్లు సుముఖము వ్యక్తం చేసి వారి హెడ్ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని త్వరలో బ్యాంకులు ప్రారంభిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత పెంచే దిశగా బ్యాంకర్లు విస్తృతంగా క్యాంపులు నిర్వహించాలని అన్నారు.
జిల్లాలోని నిరుద్యోగ యువత, మహిళా సంఘాలకు అవసరమైన శిక్షణ అందించి బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు దిశగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రగతి – సోషల్ సెక్యూరిటీ పథకాల పై గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాలని, అర్హులైన జన్ ధన్ ఖాతాదారులందరికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా పథకాలు అందేలా చూడాలని , రాబోయే 3 నెలల కాలంలో అర్హులైన ఖాతాలను గుర్తించి వారికి పి.ఎం.ఎస్.బి.వై, పి.ఎం.జె.జె.బీ.వై పథకాలు వర్తింపజేయాలని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట రుణాల కింద 2024-25 సంవత్సరానికి 77,425 ఖాతాలకు 1519 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, జూన్ చివరి నాటికి 14,476 ఖాతాలకు 201 కోట్లు మాత్రమే పంపిణీ చేయడం జరిగిందని, రుణమాఫీ ప్రక్రియ ముగుస్తున్నందున రుణాల రెన్యువల్ పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాన్ని సాధన దిశగా కృషి చేయాలని అన్నారు.
వ్యవసాయ టర్మ్ రుణ లక్ష్యం 421 కోట్లకు గాను 135 కోట్లు మాత్రమే అందజేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాంకులు వ్యవసాయ టైం రుణ లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని అన్నారు.కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసీ బ్యాంకు వ్యవసాయ టర్మ్ రుణ లక్ష్యాల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
చిన్న ,సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల పంపిణీ నిర్దేశించిన లక్ష్యంలో 32 శాతం మాత్రమే పూర్తి చేశామని తెలిపారు.మహిళా సంఘాలకు అందించే రుణాల పరిమితిని 20 లక్షల వరకు పెంచడం జరిగిందని దీని ప్రకారం రుణాల పంపిణీ బ్యాంకర్లు చేయాలని కలెక్టర్ సూచించారు.స్వశక్తి మహిళా సంఘాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం రూరల్ సెర్ఫ్ ద్వారా 56.37 శాతం, మెప్మా ద్వారా 30.82 శాతం రుణాలు పంపిణీ చేశామని అన్నారు.
ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, సిరిసిల్లలో నేత కార్మికులకు, వేములవాడ దేవాలయం పరిసరాల్లోని వ్యాపారులను, మార్కెట్ యార్డ్ దగ్గర, ఉన్న చిన్న చిన్న వ్యాపారులను పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది సర్వే నిర్వహించి వారి రోజు అవసరాల నిమిత్తం పీఎం స్వానిధి క్రింద మరియు ఇతర రుణాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద సెప్టెంబర్ నాటికి 59 ప్రాజెక్టులకు 2 కోట్ల 99 లక్షల రుణాలు అందించడం వల్ల 855 మన యువకులకు ఉపాధి కల్పన జరిగిందని, ముద్రా యోజన పథకం ద్వారా జూన్ చివరి నాటికి 1551 యూనిట్లకు 25 కోట్లతో 94 లక్షల రుణాలు అందించామని అన్నారు.పి.ఎం.ఎఫ్.ఎం.ఈ.క్రింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించే దిశ ప్రస్తుతం ఉన్న యూనిట్ల విస్తరణకు, నూతన యూనిట్ల గ్రౌండింగ్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
పి.ఎం.ఎఫ్.ఎం.ఈ.క్రింద ఇప్పటివరకు 648 దరఖాస్తులు రాగా 267 రుణాలు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 213 రుణాల పంపిణీ పూర్తి అయిందని, 299 దరఖాస్తులు తిరస్కరించామని అధికారులు తెలిపారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలో రుణాలు మంజూరు చేసినప్పటికీ 32 మంది దరఖాస్తు దారులకు రుణాలు పంపిణీ చేయకపోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు.
మంజూరు చేసిన రుణాలను వేగవంతంగా పంపిణీ చేసి యూనిట్ త్వరగా గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని 43 వేల 770 రైతులకు 346 కోట్ల 63 లక్షల సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని, ఇప్పటివరకు 40 వేల 331 రైతులకు 324 కోట్ల 45 లక్షల 2011 పూర్తయిందని, పెండింగ్ రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 వేల పాడి పశువుల యూనిట్లను 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లింకేజ్ రుణాలతో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 619 యూనిట్ల పంపిణీ పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు 236 యూనిట్ల గ్రౌండ్ చేశామని అన్నారు.
మొదటి దశలో మంజూరు చేసిన పాడి పశువుల యూనిట్ల సబ్సిడి సోమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని, ఎస్సి అధికారులు బ్యాంకర్లు సమన్వయంతో పని చేసి సంబంధిత లబ్దిదారులచే పాడి పశువుల యూనిట్ త్వరగా గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, ఆర్.బీ.ఐ ఎల్.డి.ఓ సాయి తేజ రెడ్డి, నాబార్డ్ డీడీఎం దిలీప్ చంద్ర, యు .బి.ఐ.డీజీఎం అపర్ణ రెడ్డి, వివిధ బ్యాంక్ కంట్రోలర్లు, మేనేజర్లు, సంబంధిత జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.







