అర్హులకు పోడు పట్టాల అందించేందుకు పటిష్ట కార్యాచరణ : మంత్రి కొండా సురేఖ

రాజన్న సిరిసిల్ల జిల్లా: హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి.

 Strong Action To Provide Diplomas To The Deserving Minister Konda Surekha, Mini-TeluguStop.com

రాష్ట్ర అటవీ , పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తో కలిసి పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం, జారీ చేసిన పోడు భూముల పట్టాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత అధికారులు వివరించారు.ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తున్న గిరిజనులు, లేదా 13 డిసెంబర్ 2005 నాటికి మూడు తరాలపాటు సాగు చేసిన గిరిజనేతరులకు పోడు భూముల పట్టా పంపిణి అర్హులని అధికారులు పేర్కొన్నారు.మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,30,735 మంది అర్హులను గుర్తించి వారికి 6,69,676 ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ ,పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆమోదించిన ఆర్ఓఎఫ్ఆర్ దరఖాస్తుల పట్టాలు లబ్ధిదారునికి చేరాయో లేదో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.

మన రాష్ట్రంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీశాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

పోడు భూముల పట్టా కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అర్హత ఉంటే వారికి పట్టా పంపిణీకి చర్యలు తీసుకోవాలని, సదరు దరఖాస్తును తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ నివేదిక అందించాలని అన్నారు.

ఆర్.

ఓ.ఎఫ్.ఆర్.చట్టం ప్రకారం గతం నుంచి సాగు చేసుకుంటున్నా అటవీ భూములకు మాత్రమే పట్టాలు అందించాలని, కొత్తగా రాష్ట్రంలో ఇంచ్ అటవీ భూమి కూడా సాగు చేయడానికి వీలు లేదని, అటవీ భూముల సంరక్షణకు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నూతన ఆక్రమణలు జరగడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు.

ఆర్.ఓ.ఎఫ్.ఆర్.చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు,ఆదివాసీలకు మాత్రమే పట్టాలు మంజూరు చేయాలని, వలస వచ్చి నూతనంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, గిరిజనులకు అటవీ శాఖ వ్యతిరేకం అనే భావన తొలగించే విధంగా పని చేయాలని అన్నారు.

కొత్తగా అడవుల నరికివేత జరగకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అటవీ భూములు చెట్ల నరికివేత వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు.అటవీ భూముల్లో స్మగ్లింగ్ జర్గకుండా పక్కా నిఘా ఏర్పాటు కావాలని మంత్రి ఆదేశించారు.

పెండింగ్ పోడు భూముల పట్టా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు.ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందజేయాలని తెలిపారు.

అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు సౌకర్యం, త్రాగు నీరు , ఆసుపత్రి వంటి మౌలిక వసతుల కల్పన పనులకు అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఫాలో అప్ చేయాలని మంత్రి ఆదేశించారు.పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామ్ ఆయిల్, జీడి మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల పట్టా కోసం 507 దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పిస్తే కేవలం 27 మందికే పట్టాలు వచ్చాయని , మిగిలిన లబ్ధిదారులకు కూడా పట్టాలు అందేలా చూడాలని ప్రభుత్వ విప్ కోరారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, కోనరావుపేట చెందుర్తి , గంభిరావు పేట, రుద్రంగి, కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట, మండలాల్లోని గిరిజనులకు పోడు పట్టాలు రాలేదని, వీరి దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయిలో రీ సర్వే నిర్వహించి పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు.

వేములవాడ నియోజకవర్గం పరిధిలో మోత్కరావుపేట ,చందుర్తి రోడ్డు పనులు అటవీ అనుమతుల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఖానాపూర్ నుంచి హైదరాబాదుకు వయ రాయికల్ వెళ్ళడానికి 35 కిలోమీటర్లు మేర ప్రయాణం బారం తగ్గుతుందని అన్నారు.రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో 3.5 కిలోమీటర్లు వేసేందుకు అవసరమైన అనుమతులు త్వరగా అందేలా చూడాలని ప్రభుత్వ విప్ కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ శాఖ అధికారి బాలామణి ,జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్ధన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube