రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కోసం ఉద్దేశించిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.సిరిసిల్ల డివిజన్ కు సంబంధించి సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, వేములవాడ డివిజన్ కు సంబంధించి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పోలింగ్ విధుల్లో పాల్గొనే పీఓ లు, ఏపీఓ లు, ఓపీఓ లకు పోలింగ్ విధులు, నిర్వహణపై ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు.సిరిసిల్లలో మొత్తం 1,685 మంది, వేములవాడలో మొత్తం 1050 మంది సిబ్బందికి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 4, 6 వ తేదీల్లో పీఓ లు, ఏపీఓ లకు ఉదయం నుండి సాయంత్రం వరకు, 8 వ తేదీన ఓపీఓ షిఫ్ట్ ల వారీగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొంత మందికి, తిరిగి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కొంత మందికి శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తును శిక్షణా కేంద్రాల్లో అందించాలని సూచించారు.
శిక్షణ కేంద్రాలకు వచ్చే సిబ్బందికి భోజన సదుపాయం, త్రాగునీటి సదుపాయం కల్పించాలని, కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్, సిరిసిల్ల ఏఆర్ఓ పి.గౌతమి, వేములవాడ ఏఆర్ఓ రాజేశ్వర్, చీఫ్ ప్లానింగ్ అధికారి పి.బి.శ్రీనివాస చారి, డీఈఓ రమేష్ కుమార్, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ కుమార్, తహశీల్దార్లు షరీఫ్ మోహినొద్దీన్, మహేష్ కుమార్, నాయబ్ తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.







