జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ పై ఎల్ అండ్ టీ కంపెనీ యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని ఎల్ అండ్ టీ సంస్థ గతంలో ప్రకటించింది.
అయితే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని చెబుతూ ఎల్ అండ్ టీ సంస్థ ఈనెల 5వ తేదీన ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసింది.ఈ క్రమంలోనే ఎల్ అండ్ టీ మేనేజర్ సురేశ్ ఇరిగేషన్ ఈఎన్సీకే లెటర్ రాశారని సమాచారం.
బ్యారేజ్ కు సంబంధించిన రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 29తో ముగిసిందని ఎల్ అండ్ టీ సంస్థ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేయాలంటే ప్రభుత్వం కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాలని ఎల్ అండ్ టీ సంస్థ లేఖలో తెలిపింది.బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యాం నిర్మాణం కోసం రూ.55.75 కోట్లతో పాటు బ్యారేజ్ పునరుద్ధరణ పనుల కోసం రూ.500 కోట్లు అవసరం అవుతుందని వెల్లడించింది.అయితే ఈనెల 5వ తేదీనే ఎల్ అండ్ టీ లేఖ రాసినా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదని సమాచారం.అంతేకాకుండా ఈనెల 11, 14న రెండుసార్లు ఇరిగేషన్ శాఖపై రివ్యూ నిర్వహించినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లలేదని తెలుస్తోంది.







