ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) బలం పుంజుకుందని, పార్టీ నాయకులంతా సమిష్టిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి సారించారని అంతా భావిస్తూ ఉండగా, పార్టీకి సంబంధించిన పదవుల్లో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీ హై కమాండ్ కు తమ ప్రాధాన్యం ఏమిటో తెలిసి వచ్చేలా చేయాలని భావిస్తున్నారు.ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకోవడంతో, ఆ పార్టీలో హుషారు కనిపిస్తోంది.
అదే సమయంలో కొన్ని కీలకమైన పదవులను కాంగ్రెస్ భర్తీ చేసింది.అయితే ఆ పదవుల్లో సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెట్టడం వంటి విషయాలపై సీనియర్ నేతలు కొంతమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్( former MP Ponnam Prabhakar ) పార్టీ పదవుల్లో తనకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై అలక చెందినట్లుగా తెలుస్తోంది.పార్టీలో సీనియర్ నేతగా ఉన్నా, ఇన్నేళ్లు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే సరైన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదని, ఇటీవల భర్తీ చేసిన ఏ కమిటీలోను తనకు అవకాశం ఇవ్వకపోవడంపై పొన్నం ప్రభాకర్ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.ఈ మేరకు తన నివాసంలోనే డిసిసి అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.అలాగే ముఖ్య అనుచరులతోనూ పొన్నం అంతర్గతంగా సమావేశం నిర్వహించారట.
ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ కు పార్టీ కమిటీల్లో స్థానం దక్కకపోవడంపై చర్చించారట.ఈ విషయంలో హై కమాండ్ స్పందించి నిర్ణయం తీసుకోకపోతే తమ సత్తా ఏమిటో చూపించాలని నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు రేపటికల్లా పిలుపు రాకపోతే కరీంనగర్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 500 కార్లలో హైదరాబాద్ కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) కలిసి అక్కడే కీలక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరికలను పంపుతున్నారట.

ఇక పొన్నం తో భేటీ అయిన తర్వాత కవంపల్లి సత్యనారాయణ( Kavampalli Satyanarayana ) ఈ వ్యవహారంపై స్పందించారు .కాంగ్రెస్ లో ఏ కమిటీల్లోను పొన్నం ప్రభాకర్ కు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ప్రతి కార్యకర్తకు బాధ కలిగించిందని , పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని, అటువంటి కీలక నాయకుడుని పట్టించుకోకపోవడం, ఆయన సీనియారిటీని గుర్తించి పదవి కేటాయించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఈ విషయంలో హై కమాండ్ స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోకపోతే తమ తడాఖా చూపిస్తామని పొన్నం అనుచరులు హెచ్చరిస్తున్నారు.







