ఏపీలో బిజెపి( BJP ) పరిస్థితి ఎలా ఉన్నా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం ఏపీ అధికార పార్టీ వైసిపి విషయంలో ఎప్పుడు సానుకూలంగానే ఉంటూ జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు.వీటివలె ఏపీకి భారీ నిధులు విడుదల చేశారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) నిర్మాణానికి నిధులు విడుదల చేయడం వంటివి జరిగాయి.కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జగన్ సహకారం అందిస్తున్నారు.
కీలకమైన బిల్లుల ఓటింగ్ లోను వైసీపీ ఎంపీ లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగానే ఓటింగ్ లో పాల్గొంటున్నారు.అసలు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అంటే, పరోక్షంగా బిజెపి సహకారం అందించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
బిజెపి ఏపీ ప్రభుత్వానికి అన్న విషయల్లో సహకారం అందించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, కేంద్ర బిజెపి పెద్దలు ఎవరు వాటిని పరిగణలోకి తీసుకునేవారు కాదు.అయితే మొన్న శ్రీకాళహస్తి, నిన్న విశాఖలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు.

ఏపీలో అవినీతి పెరిగిపోయిందని , జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని , ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని , తరచుగా తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని , ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదనీ జేపీ నడ్డా, అమిత్ షాలు విమర్శలు చేశారు.ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేంద్రానివే అని, వాటికి పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయి అని అమిత్ షా విమర్శలు చేశారు.ఇంకా అనేక అనేక ఆరోపణలు ఏపీ ప్రభుత్వంపై చేశారు.అయితే ఈ ఆరోపణలు చేసింది బిజెపి అగ్ర నేతలు కావడంతో , వారిపై విమర్శలు చేసే విషయంలో వైసిపి తర్జన భర్జన పడినా, చివరకు ఆ విమర్శలకు కౌంటర్లు ఇచ్చింది.
ఈ మేరకు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి( Vijayasai Reddy ) విమర్శలపై స్పందించారు.ఏపీలో బిజెపికి చోటు లేదని , ఆ పార్టీ నాయకులు ఎంత ప్రచారం చేసినా ఉపయోగం లేదని, ఇక్కడ నేతలు విమర్శలు చేసినా, ఉపయోగం ఉండడం లేదని, ఢిల్లీ స్థాయి నుంచి నేతలను రప్పించుకుని విమర్శలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

బిజెపి నాయకులు ఏపీలో ఎక్కడికి వెళ్లినా, రాష్ట్ర ప్రజలు వారిని నిలదీస్తున్నారని, రాష్ట్రానికి కేటాయించాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఏపీ పునార్వవస్తీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల గురించి నిలదీస్తున్నారని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ బిజెపిని ప్రజలు తిట్టిపోస్తున్నారని విజయసాయి విమర్శలు చేశారు. ఇక మంత్రి పేర్ని నాని వంటి వారు బిజెపిపై విమర్శలు చేసినా, ఏదో మొహమాటంగా కౌంటర్ ఇచ్చారు తప్ప, టిడిపి , జనసేన లను విమర్శించినంత స్థాయిలో బిజెపి పై వైసీపీ నేతలు విమర్శలు చేయలేకపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.







