తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS party )లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన సీఎం కేసీఆర్( CM KCR ) పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గాలు, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను ప్లేనరీలను ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పాటు, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేస్తూ పని తీరు సక్రమంగా లేని వారికి వార్నింగులు ఇస్తున్నారు.
తాజాగా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తున్నాయి .పనితీరు సక్రమంగా లేని వారికి టికెట్ ఇచ్చేదే లేదు అంటూ తెగేసి చెప్పేశారు.

దీంతో సక్రమంగా లేని ఎమ్మెల్యేలు ఎవరు ? కెసిఆర్ ఆగ్రహానికి కారణం ఏమిటి ? ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనే విషయాలపై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరుగుతోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మక కావడం , జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఖచ్చితంగా తెలంగాణలో గెలిచి తీరితేనే అది సాధ్యమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.అందుకే రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని కేసిఆర్ నిర్ణయించుకున్నారు.

దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS mlas ) ఏం చేస్తున్నారు.వారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా ? అవినీతి వ్యవహారాల్లో వారి పాత్ర ఎంతవరకు ఉంది ? నియోజకవర్గ ప్రజల్లో ఎమ్మెల్యే పనితీరుపై ఏ రకమైన అభిప్రాయం ఉంది ? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి.ఇలా అనేక అంశాలపై సర్వే రిపోర్టులు తెప్పించుకున్నట్లు సమాచారం.

ఈ రిపోర్టులో దాదాపు 35 మంది ఎమ్మెల్యే పనితీరు ఏమాత్రం బాగాలేదని రిపోర్ట్ వచ్చిందట.ఇదే విషయాన్ని నిన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ప్రస్తావించారట.దీంతో టిక్కెట్ దక్కే అవకాశం లేని ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ మొదలైందట.








