కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ప్రపంచానికి ఇంకా నిద్రలేని రాత్రులను మిగులుస్తోన్న సంగతి తెలిసిందే.మూడేళ్ల పాటు స్వైర విహారం చేసి.
ఇప్పటికీ చైనా తదితర దేశాలను కరోనా వణికిస్తోంది.ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడగా.
ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి.దీంతో పలు దేశాలు ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్నాయి.
దీనికి తోడు కరోనా కారణంగా లాక్‌డౌన్, ఆంక్షల నేపథ్యంలో అనేక మంది విదేశీ కార్మికులు వారి స్వదేశాలకు వెళ్లిపోవడంతో ఆయా దేశాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి.ఇందులో యూకే ఒకటి.
గతేడాది ట్రక్కు డ్రైవర్లు లేక ఇంగ్లీష్ గడ్డ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.అలాగే ఆ దేశ వైద్య రంగంలోనూ నిపుణులైన హెల్త్ కేర్ వర్కర్స్ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్ల కొరతను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా యార్క్ అండ్ స్కార్‌బరో హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోన్న యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) ట్రస్ట్ భారతీయులకు శుభవార్త చెప్పింది.మనదేశానికి చెందిన 100 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను నియమించుకుంటున్నట్లు చెప్పింది.ది స్కార్‌బరో న్యూస్ ప్రకారం.యార్క్ అండ్ స్కార్‌బరో టీచింగ్ హాస్పిటల్స్ , ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ కొద్దిరోజుల క్రితం కేరళకు రిక్రూట్‌మెంట్ ట్రిప్ వేసింది.దీనిలో భాగంగా 97 మంది రిజిస్టర్డ్ నర్సులు, 10 మంది అనుబంధ ఆరోగ్య నిపుణులతో సహా 107 మంది వైద్య సిబ్బందికి ఆఫర్ లెటర్‌లను అందించింది.

ఈ ఏడాది జనవరిలో యార్క్ అండ్ స్కార్‌బరో ఆసుపత్రులను నడుపుతోన్న ఈ ట్రస్ట్.అడల్ట్ ఇన్‌పేషెంట్ ఏరియాల్లో 11.5 శాతం హెల్త్ కేర్ సపోర్ట్ వర్కర్ల కొరతను ఎదుర్కొంటోందని నివేదిక వెల్లడించింది.అంతర్జాతీయ నర్సులు ట్రస్ట్‌లో చేరిన తర్వాత అడల్ట్ ఇన్‌పేషెంట్ వార్డులలో ఖాళీల రేటు 7.6 శాతానికి పడిపోయిందని బోర్డుకు తెలిపింది.కాగా.డిసెంబర్ 15, 2022న ఎన్‌హెచ్ఎస్‌కు చెందిన నర్సులు .తమ ఖర్చులు, జీతాల పెంపు కోరుతూ 106 సంవత్సరాల్లో తొలిసారిగా దేశవ్యాప్త సమ్మెను నిర్వహించారు.బ్రిటన్ వ్యాప్తంగా 76 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 1,00,000 మంది నర్సులు సమ్మెకు దిగారని అంచనా.
ఇకపోతే.యూకే వ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో 43,000 మంది నర్సులు తమ కెరీర్ ప్రారంభ దశల్లోనే నిష్క్రమించడంతో అక్కడి ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.







