ఇటీవల కాలంలో దారుణాలు చేయడానికి సమయం, సందర్భం లేకుండా పోయింది.మామూలుగా అయితే తాళం వేసిన ఇంటిలో దొంగతనం జరిగే అవకాశలు ఎక్కువగా ఉంటాయి.
కానీ ఒంటిపై ఉండే నగలు కొట్టేశారంటే, ఆ దొంగల సాహసాన్ని మెచ్చుకోవచ్చు.ఒక వృద్ధురాలి కండ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు కట్టేసి మరి ఒంటిపై ఉండే నగలు కాజేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా లోని బాలా నగర్ మండలం పెద్దరవల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పెద్దరవల్లి గ్రామంలో పద్మమ్మ, గోవర్ధన్ రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు.

పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు.గోవర్ధన్ రెడ్డి చనిపోయాక పద్మమ్మ ఒంటరిగానే జీవిస్తోంది.ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం పద్మమ్మది.
ఒంటిపై ఏడున్నర తులాల బంగారం ధరించిన పద్మమ్మపై కొంతమంది దుండగులు కన్నేశారు.గురువారం రాత్రి సుమారు 8:30 సమయంలో, పద్మమ్మ ఇంట్లోకి చొరబడి కళ్ళకు గంతలు కట్టి, చేతులు కాళ్లు కట్టేసి, ఒంటిపై ధరించిన ఏడున్నర తులాల బంగారును కాజేసి పారిపోయారు.పద్మమ్మ వృద్ధురాలు కావడంతో, వారిని ఎదిరించలేక వారికి సహకరించాల్సి వచ్చింది.ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా చిన్న చిన్న దొంగతనాలు పద్మమ్మ ఇంట్లో జరిగాయి.

ఇక గతంలో పద్మమ్మ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఈ విషయం తెలిసిన వెంటనే మహబూబ్ నగర్ డిఎస్పి మహేష్ కుమార్, క్రైమ్ డిఎస్పీతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పద్మమ్మతో చోరీ ఎలా జరిగిందో అడిగి తెలుసుకుని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.త్వరలోనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.డీఎస్పీ తో పాటు జడ్చర్ల టౌన్ సిఐ రమేష్ బాబు కొంతమంది క్లూస్ టీం సభ్యులు దర్యాప్తు ప్రారంభించారు.







