ప్రజలచేత,ప్రజల కొరకు,ప్రజలే ఎన్నిక కావడాన్ని ప్రజాస్వామ్యం అంటారని అబ్రహాం లింకన్ ఏనాడో సెలవిచ్చారు.ప్రజాస్వామిక దేశమైన మనదేశంలో అన్నిరాష్ట్రాలు భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ,దాననుసారంగా నడుచుకుంటూ జీవితాలను కొనసాగిస్తున్నాం.
అందులో భాగాంగాన్నే మనదేశంలో కూడా వంశానుక్రమపాలన నుంచి ప్రజాస్వామ్యపాలనకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం.దేశ,రాష్ట్ర అభివృద్ధి అనేది అక్కడవుండే పాలకులమీద ఆధారపడి ఉంది.
పాలకులు ఎన్నిక కాబడాలంటే అది ఓటరుచేతుల్లో ఉంటుంది.అంటే ఒక మంచివ్యక్తిని ఎన్నుకోవాలంటే ఓటరు యొక్క పాత్ర ఏమిటో అవగతమవుతుంది.
అలాంటి సమయంలో ఓటరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి,మంచి నాయకులను ఎన్నుకోవడానికి పూనుకోవాలి.కానీ మన ఓటుహక్కును దుర్వినియోగ పరుచుకోవద్దు.
ఓటుహక్కు అనేది మనకు భారతరాజ్యాంగం మనకిచ్చిన గొప్ప ఆయుధం.కావున దానిని సమాజాభివృద్ధికై ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిఒక్కరు ఎన్నికలలో పోటీచేసే అర్హతను కలిగివుంటారు .కానీ నేడు ఎన్నో,మరెన్నో రాజకీయపార్టీలు వెలసి,ఎన్నికలలో పోటీచేసి, ఓటరు మహాశయులను వివిధ ప్రలోభాలకు గురిచేస్తూ,వారి ఓట్లను కొల్లగొట్టి ప్రభుత్వ పాలనను కొనసాగిస్తుంటారు.
మన రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి,తనస్వంత నిర్ణయం మేరకు పార్టీకి,శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ మునుగోడు ఉపఎన్నికలకు 2022 అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది.
నామినేషన్ల దాఖలు చేయడానికి అక్టోబర్ 14 చివరి తేదీగా ప్రకటించి,నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 15వ తేదీని గడువుగా పెట్టి, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వరకు గడువు ఇచ్చారు.ఇప్పటికే ఈ తతంగమంతా ముగిసి,వివిధ ప్రధానపార్టీల ఎన్నికల ప్రచారాలు చివరిదశకు చేరుకున్నాయి.
ఈ ప్రచార పర్వంసైతం ఇవాళ సాయంత్రం ముగియనున్నది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ మునుగోడులో నవంబర్ 3వ తేదీన ఉపఎన్నిక జరపనుంది.
ఆ తర్వాత ఓట్ల లెక్కింపును నవంబర్ 6వ తేదీన చేపడతారు.నవంబర్ 8వ తేదీలోపు ఎన్నికలప్రక్రియను ముగించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇప్పటికే అన్ని వివిధ రాజకీయపార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు.ఒకరిపై మరొకరు విమర్శించుకుంటూ,చివాట్లు పెట్టుకుంటూ,సినిమా డైలాగుల మేరలో పంచులు విసురుకుంటూ,పేద ప్రజలకు ఎన్నో వాగ్దానాలను ఇస్తున్నారు.ఒక్కొక్క మండలంలో వివిధ రాజకీయపార్టీల పక్షాన నాయకులు వారివారి అభ్యర్థి తరుపున ప్రచారం చేయడంకోసం అహర్నిశలు పాటుపడుతున్నారు.ఈ సమయంలో ఓటరు దేవుళ్ళు ఆలోచించి సక్రమమైన నాయకుని ఎన్నుకోకపోతే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండకతప్పదు.
మన రాష్ట్రాభివృద్ధి పాలకులపై ఆధారపడి ఉంటుంది.కావున ప్రతిఓటరు అలోచించి నిర్ణయం తీసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనాఉంది.
ఇందులో భాగంగా ప్రతి ఓటరుకు ఉండే సందేహాల నివృత్తికై చిన్న ప్రయత్నంలో భాగంగా క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏది ఏమైనాప్పటికీ ఈ మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు ఒక ప్రత్యేకత సంతరించుకున్నది.
ఏడాదిన్నర కాలంలో రాబోయే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.కావున రాష్ట్రప్రజలందరూ మునుగోడు ఓటర్లు ఇచ్చే తీర్పును ఆసక్తితో చూడనున్నారు.
అంటే మునుగోడు ఓటర్లపై ఏలాంటి బాధ్యత ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.అందుకే రాజకీయ నాయకులు చెప్పుడుమాటలు వినకుండా,ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా,పాలకుల పనితీరును పరిశీలిస్తూ,అభివృద్ధికి,ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడే అభ్యర్థిని ఎన్నుకోవడానికి పూనుకుంటూ,రాష్ట్ర ప్రజలందరికీ ఓటరు మహాశయునియొక్క బాధ్యతను గుర్తుచేస్తారని ఆశిద్దాం.







