మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి రూపొందించిన బ్యాలెట్ పేపర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా బ్యాలెట్ పేపర్ ను మార్చాల్సిందేనని ఆయన బుధవారం డిమాండ్ చేశారు.మునుగోడు బ్యాలెట్ పేపర్ నమూనాను రిటర్నింగ్ అధికారి బుధవారం విడుదల చేశారు.
బ్యాలెట్ పేపర్ లో మొదటి స్థానంలో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అందోజు శంకరాచారి ఉండగా… రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాలుగో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఉన్నారు.
బ్యాలెట్ పేపర్ లో ఈ కూర్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉండాలని, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ లెక్కన బీఎస్పీ అభ్యర్థి తర్వాతి స్థానంలో బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉండాలని ఆయన వాదించారు.ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న కూసుకుంట్ల పేరు నాలుగో స్థానంలో ఉండాలన్నారు.
అయితే అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ అభ్యర్థి పేరును రెండో స్థానంలో ఎలా పెడతారని రేవంత్ ప్రశ్నించారు.ఇప్పటికైనా నిబంధనలను మరోమారు పరిశీలించి టీఆర్ఎస్ అభ్యర్థి పేరును నాలుగో స్థానానికి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.







