తెలుగు బాష అంటే ప్రస్తుతం తప్పక చదవాలనుకునే సబ్జెక్ట్ గా చాలా మంది దృష్టిలో మిగిలిపోతోంది.తెలుగుకు వెలుగు నివ్వాలంటూ ఉపన్యాసాలు చేసే నోళ్లె కానీ నిజమైన వెలుగు తీసుకువచ్చేందుకు గుండెల్లో గూడు కట్టుకున్న తెలుగు బాషాభిమానాన్ని వ్యక్త పరిచేది మాత్రం కొందరే.
ఆ కొందరిలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లా వాసి, తెలుగు బాషాభిమాని అయిన పాలకుర్తి సుబ్బు , వ్యాపార నిమ్మిత్తం సింగపూర్ లో స్థిరపడినా దేశంపై అభిమానం, పుట్టిన ఊరుపై మమకారం, తెలుగు బాష పై ఉన్న ప్రేమ చెక్కు చెదరలేదు.ఒక పక్క వ్యాపారం చూసుకుంటూనే మరో పక్క తెలుగు బాషాభివృద్ది కోసం సింగపూర్ లో కాకతీయ సాంస్కృతిక పరివారం అనే తెలుగు సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తూ తెలుగు వెలుగుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు బాష విలువను తెలియజేసే విధంగా, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను, కుటుంభ విలువలను భావి తరాలకు తెలియజేయాలనే ఆలోచనతో శబ్ద కాన్సెప్ట్ వేదికగా నిర్మాతగా మారి పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు.తాజాగా ఆయన నటించి, కధను, మాటలు అందించిన సిరిజోత అనే షార్ట్ ఫిల్మ్ పోస్టర్ , ట్రైలర్ ను మాజీ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సింగపూర్ లో ఓ వేడుకలో ఆవిష్కరింపజేశారు.
సింగపూర్ లో తెలుగు బాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళా సారధి వారి విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగపూర్ విచ్చేసిన వెంకయ్య నాయుడు గారితో శబ్ద కాన్సెప్ట్ నుంచీ త్వరలో విడుదల కానున్న సిరిజోత షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేయించారు.
అమ్మ బాష అయిన మన తెలుగును కాపాడుకోవడం కోసం కొందరు కలిసి చేసే ప్రయత్నమే ఈ సిరిజోత గా సుబ్బు పాలకుర్తి వెంకయ్య కు వివరించగా, సహజంగా తెలుగు బాషాభిమాని అయిన వెంకయ్య గారు “సిరిజోత” టైటిల్ ఎంతగానే తనను ఆకట్టుకున్నదని టీమ్ అందరికి అభినందనలు తెలిపారు.కాగా సిరిజోత ట్రైలర్ షార్ట్ ఫిల్మ్ అందరిని ఆలోజింపచేసే విధంగా ఉంటుందని, ప్రతీ ఒక్కరూ అనుభూతిని పొందుతారని, తెలుగు బాషాపై ఉన్న గౌరవం, ప్రేమ మరింత వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సుబ్బు పాలకుర్తి.సిరిజోత కు తనతో పాటు కధ, మాటలు కవితా కుందుర్తి అందించారని సుబ్బు తెలిపారు.
త్వరలో ఈ ఫిల్మ్ ను విడుదల చేస్తామని తెలుగు వారందరూ “సిరిజోత” ను ఆదరించాలని కోరారు…
.