బ్యాంక్ లావాదేవీలకు సంబందించిన వివాదాలు పరిష్కరించేందుకు ఈ నెల 17న మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా జడ్జి టి.శ్రీనివాసరావు తెలిపారు.
మంగళవారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ మెగా లోక్ అదాలత్‌లో వివిధ రకాల బ్యాంక్ లు వివాదాలు పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.
మొత్తం 2231 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు.వీటితో బాటు మరో 200 పెండింగ్ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.
ఈ మెగాలోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు మంచి ఉపయోగం ఉంటుందని, బ్యాంక్ లు ఈ సందర్భంగా మూల ధనంలోనే తగ్గింపు ఇచ్చి వివాదాలను పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకోదలుచుకున్న కక్షిదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరే అవకాశాలున్నాయన్నారు.
ఈ మెగా లోక్ అదాలత్‌లో జిల్లా కోర్టుతో బాటు ఏడీజే, సబ్‌కోర్టులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొని వివాదాలను పరిష్కరించేందుకు పనిచేస్తాయని తెలిపారు.ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని, వివాదాలను పరిష్కరించుకోవలసిందిగా జిల్లా జడ్జి టీ.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో బాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషాలు పాల్గొన్నారు.







