తెలంగాణలో ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ వరుసగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి.ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున నిర్వహించి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. టీఆర్ఎస్, బీజేపీ బహిరంగసభలను తలదన్నేలా తెలంగాణలో రాహుల్ గాంధీ సభను నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.
అయితే మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే రాహుల్ గాంధీ సభను నిర్వహించాలని రేవంత్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నారు.
బీజేపీ తరహాలోనే పెరేడ్ గ్రౌండ్స్‌లోనే సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నప్పటికీ.
ఈ సభ అధికార పార్టీని టార్గెట్ చేసే విధంగా ఉండాలంటే మరో ప్రాంతంలో సభను ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి భావించారు.ఈ క్రమంలో సిరిసిల్లను భారీ సభను ఏర్పాటు చేయడం ద్వారా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసే విధంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అయితే రాహుల్ సభను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ వీలును బట్టి ఆగస్టు తొలివారంలో బహిరంగ సభను నిర్వహించే యోచనలో టీపీసీసీ ఉంది.
రాహుల్ గాంధీతో తెలంగాణలో మరిన్ని సభలు ఉండేలా ప్లాన్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ప్రజల్లోకి వెళుతుందనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులు, ప్రజల్లో కల్పించాలని భావిస్తోంది.
ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీల నుంచి వలసలను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఊపును కంటిన్యూ చేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. నల్లాల ఓదేలు, రావి శ్రీనివాస్, బోడ జనార్ధన్, తాటి వెంకటేశ్వర్లు, ఎర్ర శేఖర్, బాలు నాయక్, విజయారెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు.తాజాగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలలోని కీలక 20 మంది నేతలకు రేవంత్ గాలం వేసినట్లు సమాచారం.
టీఆర్ఎస్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, వేముల వీరేశం, పిడమర్తి రవి వంటి నేతలను టీఆర్ఎస్ నుంచి లాగాలని రేవంత్ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది.