ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పోతోంది.మరోవైపు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ సముద్రాలు, మహాసముద్రాలలో కలిసిపోతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచమంతటా ఉన్న సముద్రాలలో కోట్ల టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు తినే పదార్థాలు అనుకుని కొన్ని సముద్ర జీవులు మింగేస్తున్నాయి.
మైక్రోప్లాస్టిక్ కూడా సముద్రాల్లో అధికమొత్తంలో పేరుకుపోయింది.వీటిని చిన్న జీవులు తినేసి మృత్యువాత పడుతున్నాయి.
తిమింగలాలు, సొర చేపలు పెద్ద ప్లాస్టిక్ వ్యర్థాలను తిని చనిపోతుంటే చిన్న జీవులు మైక్రోప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి.ఇప్పటికే ప్లాస్టిక్ భూతం బారినపడి కోట్లాది సముద్ర జీవులు ప్రాణాలు వదిలేశాయి.
ఈ నిజాలను శాస్త్రవేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.కానీ సముద్రాల్లో నుంచి ప్లాస్టిక్, మైక్రోప్లాస్టిక్‌ను ఇప్పటికిప్పుడు తొలగించడం తలకుమించిన భారం.ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు.అందుకే శాస్త్రవేత్తలు ఈ ప్లాస్టిక్ భూతాన్ని సముద్రాల నుంచి వదిలించేందుకు సమర్థవంతమైన మార్గాలను వెతుకుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చైనా శాస్త్రవేత్తలు ఈ ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారంగా ఓ అద్భుతమైన ఉపాయం చేశారు.వీరు సముద్రాల్లో ఉండే మైక్రో ప్లాస్టిక్‌ను తినే రోబో చేపను అభివృద్ధి చేశారు.

చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ రీసెర్చర్లు ఈ రోబో ఫిష్‌ను రూపొందించారు.కేవలం 0.5 అంగుళాల సైజులో ఉండే ఈ రోబోలు లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లను సేకరిస్తాయి.నార్మల్ రోబోల కంటే 2.76 రెట్లు వేగంగా దూసుకెళ్లే ఇవి ఇతర సముద్ర జలచరాలను ఢీకొట్టవు.అందుకోసం వీటిలో స్పెషల్ టెక్నాలజీ అందించారు.
మరికొన్ని రోజుల్లో ఈ రోబో సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.







